హైదరాబాద్: తెలంగాణ సీఎం  కేసీఆర్ ప్రగతి భవన్ ఎదుట  ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు బుధవారం నాడు మెరుపు ధర్నాకు దిగారు. ప్రగతి భవన్ గేటు ఎక్కి క్యాంంప్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

డిగ్రీ, పరీక్షల నిర్వహణ విషయంలో హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్న సమయంలోనే పరీక్షలు నిర్వహణకు  ఎలా చర్యలు తీసుకొంటారని ప్రశ్నిస్తూ ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు ఇవాళ ఆందోళనకు దిగారు.

ఈ నిరసన కార్యక్రమం విషయమై  ఎన్ఎస్‌యూఐ ఎలాంటి ఆందోళన కార్యక్రమాన్ని పిలుపు నివ్వలేదు.  కానీ ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు, నేతలు పీపీఈ కిట్స్ ధరించి బుధవారం నాడు ప్రగతి భవన్ వద్ద ఆందోళనకు దిగారు.

ప్రగతి భవన్ గేటు ఎక్కి క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అతి కష్టం మీద వారిని అడ్డుకొన్నారు.

గతంలో రేవంత్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో పోలీసులు భద్రతా ప్రమాణాలను సరిగా పట్టించుకోలేదనే నెపంతో ప్రగతి భవన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.

ఇవాళ చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల్లో ఆందోళన నెలకొంది.కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన ఎన్ఎస్ యూ ఐ కార్యకర్తలు, నేతలను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్టుగా పోలీసులు తెలిపారు.