Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో జేజమ్మ సునామీ వొస్తదా ?

  • రేవంత్ చేరిక విషయంలో డికె అరుణ అసంతృప్తి
  • హరీష్ వచ్చినా కాంగ్రెస్ లోకి తీసుకుంటామంటూ పదే పదే కామెంట్స్
  • డికె అరుణ టిఆర్ఎస్ లోకి పోతారేమోనని రేవంత్ వర్గం అనుమానం
Now talk of the town dk aruna will she switch over to TRS

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకూ వేడెక్కుతున్నాయి. ఎవరు ఏ పార్టీలోకి పోతారో? ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరిన నాటినుంచి రాజకీయ ప్రకంపణలు రేగుతున్నాయి. రేవంత్ కాంగ్రెస్ లో చేరడాన్ని తెలంగాణలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు చాలా మంది వ్యతిరేకించారు. అయితే రాహుల్ గాంధీ సమక్షంలోనే రేవంత్ పార్టీలో చేరడంతో సీనియర్లు మాట్లాడే వాతావరణం లేకుండాపోయింది. అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం తెలంగాణ అంతటా కంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గద్వాల జేజమ్మ మాటలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఇంతకూ గద్వాల నాయకురాలు డికె అరుణ ఉన్నఫలంగా మంత్రి హరీష్ రావును వివాదంలోకి గుంజడంతో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరకముందే గద్వాల డికె అరుణను కలిసి ఆయన మనసులో మాట చెప్పుకున్నారు. గతంలో జరిగిన పరిణామాలను మనసులో పెట్టుకోవద్దని, కలిసి పనిచేద్దామంటూ రేవంత్ రెడ్డి రిక్వెస్టు చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి రాక పట్ల డికె అరుణ గుర్రుగానే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రేవంత్ తో కలిసి పనిచేయడం ఆమెకు ఇష్టం లేదా ఏందబ్బా అన్న అనుమానాలు కూడా రేవంత్ వర్గంలో నెలకొన్నాయి. అయతే ఇటీవల కాలంలో రేవంత్ పార్టీలో చేరకముందు కానీ, చేరిన తర్వాత కానీ డికె అరుణ ఎక్కడ కూడా వ్యతిరేకించినట్లు కనబడలేదు. పైగా బహిరంగంగా ఎక్కడా రేవంత్ రాకపై వ్యతిరేకంగా మాట్లాడలేదు.

అంతే కాదు ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తాము అంటున్నారు. పలు సందర్భాల్లో డికె అరుణ మీడియాతో ఆన్ రికార్డులో కానీ, ఆఫ్ ది రికార్డుగా కానీ రేవంత్ రాకను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పడంలేదు. అయితే ఆమె మాత్రం అసంతృప్తితో ఉన్నట్లు ఆమె అనుచరులు అంటున్నారు. ఇక రేవంత్ చేరిక విషయంలో మరో కీలక అంశాన్ని కూడా డికె అరుణ లేవనెత్తుతున్నారు. రేవంతే కాదు... మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా చేర్చుకుంటామని ఒకసారి కాదు పదే పదే అంటున్నారు డికె అరుణ. అసలు మంత్రి హరీష్ రావును ఎందుకు డికె అరుణ వివాదంలోకి గుంజుతున్నారోనని ఇటు టిఆర్ఎస్, అటు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. టిఆర్ఎస్ లో అంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండగా హరీష్ రావు పేరును పదే పదే డికె అరుణ ఎందుకు ప్రస్తావిస్తున్నారో అని అన్ని వైపులా అనుమానాలు కలుగుతున్నాయి.

అయితే తెలంగాణ రాకముందు కానీ, వచ్చిన తర్వాత కానీ హరీష్ రావుతో డికె అరుణ శత్రుత్వం మెంటెయిన్ చేయలేదు. ఇద్దరు నేతలు సత్సంబంధాలు కలిగి ఉన్నారని చెబుతున్నరు. అయితే డికె అరుణ కామెంట్స్ చూస్తే హరీష్ రావు కాంగ్రెస్ లోకి వస్తాడా? లేక డికె అరుణ నే టిఆర్ఎస్ లోకి వెళ్తారా అన్న అనుమానం ఇంకోవైపు నెలకొంది. ఎందుకంటే గత కొంతకాలంగా టిఆర్ఎస్ అధిష్టానం డికె అరుణతో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ కాంగ్రెస్ లో చేరడంతో డికె అరుణ ఏ క్షణంలోనైనా టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నట్లు రేవంత్ వర్గంలో కూడా అనుమానాలున్నాయి. అయితే ఈ విషయంలో రేవంత్ వర్గం బయట ఎలాంటి వ్యఖ్యలు చేయకుండా వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు డికె అరుణ తమ పార్టీలోకి వస్తే తమకేమాత్రం అభ్యంతరం లేదని టిఆర్ఎస్ పార్టీ పాలమూరుకు చెందిన ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లోని ఒక వర్గం కూడా డికె అరుణ టిఆర్ఎస్ తో టచ్ లో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. అయితే ఈ విషయంలో ఆ వర్గం కూడా సంయమనంతో ఉన్నట్లు వారి మాటలను బట్టి తెలుస్తోంది.

మొత్తానికి కాంగ్రెస్ లోకి హరీష్ రావు వస్తే తీసుకుంటామంటున్న డికె అరుణ ఏ ఉద్దేశంతో అన్నారో కానీ రాజకీయ వర్గాల్లో దుమ్ము దుమారం రేగుతున్నది. హరీష్ రావు వచ్చుడా? అరుణ పోవుడా అన్నది త్వరలోనే తేలుతుందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.

తిరుమల స్వామివారిని దర్శించుకున్న జగన్ ఈ వార్తతోపాటు

మరిన్ని తాజా వార్తల కోసం కింద లింక్ మీద క్లిక్ చేయండి

https://goo.gl/p4vX5F

Follow Us:
Download App:
  • android
  • ios