ప్రేమికుడితో కాకుండా వేరే యువకుడితో వివాహం జరిపించడానికి తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తుండటంతో మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమికురాలు ఆత్మహత్య చేసుకుందని తెలిసి యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ లో చోటు చేసుకుంది.
వారిద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి జీవితం పంచుకోవాలని అనుకున్నారు. నిండు నూరేళ్లు కలిసి నడుద్దామనుకున్నారు. కానీ విధి వారిని తీసుకెళ్లిపోయింది. వీరి ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద వార్త యువకుడికి తెలియడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తను లేని ఈ లోకంలో ఉండలేను అంటూ ఆ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కోమటితండాకు చెందిన శివ కు 21 సంవత్సరాలు. పక్క తండాలోని ఓ యువతిని అతడు ప్రేమించాడు. ఆమె పేరెంట్స్ జీవనోపాధి కోసం పూణె వెళ్లి జీవిస్తున్నారు. యువతి మాత్రం స్థానికంగానే ఉండేది. అయితే వీరి ప్రేమ విషయం పేరెంట్స్ కు తెలిసింది. దీంతో వారు ఆ యువతిని తీసుకొని కొన్ని రోజుల కిందట పూణెకు వెళ్లారు. అక్కడే ఆమెకు పెళ్లి చేయాలని భావించారు. అందులో భాగంగానే సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. వేరే వ్యక్తులను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆ యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని యువకుడికి ఫన్ చేసి చెప్పింది. అనంతరం సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
యువతి ఆత్మహత్య చేసుకుందనే విషయం యువకుడికి తెలియడంతో తీవ్రంగా కలత చెందాడు. తను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే షాద్ నగర్ ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య కు యత్నించాడు. అయితే స్థానికులు గమనించి శివను ఉస్మానియ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో హాస్పిటల్ లోనే మంగళవారం చనిపోయాడు. రెండు ఘటనలు పక్క పక్క తండాల్లోనే జరగడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంగళవారం సాయంత్రం వారి వారి గ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించారు.
