తెలంగాణ నిరుద్యోగులకు ఎన్నో తీపి కబుర్లు అందించిన టిఎస్పిఎస్సీ మరో శుభవార్త చెప్పేందుకు రెడీ అయిందని ముందుగా టిఎస్పిఎస్సీ వర్గాల నుంచి సమాచారం అందింది. ఈసారి మరిన్ని శుభవార్తలు చెబుతారని నిరుద్యోగులు ఆశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ఆవిర్భవించి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా 6 కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలని టిఎస్పిఎస్సీ నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి.

కానీ సాయంత్రానికి తీపివార్తలు తగ్గిపోయాయి. కేవలం రెండు మాత్రమే నోటిఫికేషన్లు వెలువరించింది టిఎస్పిఎస్సీ. ఆ రెండు కూడా ప్రాధాన్యత కలిగిన గ్రూప్స్ లాంటి ఉద్యోగాలు కావు. వైద్య ఆరోగ్య శాఖలో స్వల్పమైన పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. 6 నోటిఫికేషన్లు వస్తాయన్న ఆనందంలో ఉన్న నిరుద్యోగులకు ఈ వార్త నిరాశపరిచేలా ఉంది. ఈరోజే 6 నోటిఫికేషన్లు రాబోతున్నాయని ప్రభుత్వ అనుకూల పత్రిక నమస్తే తెలంగాణ వెబ్ సైట్ లో కూడా వార్తలొచ్చాయి. కానీ ఆచరణలో అలా జరగలేదు.

అయితే ఇవాళ రెండే నోటిఫికేషన్లు ఇచ్చినా.. మిగతా నాలుగు నోటిఫికేషన్లను త్వరలో ఇస్తామని టిఎస్పిఎస్సీ ప్రకటించింది.  ఈ మూడేండ్ల కాలంలో ఇప్పటి వరకు 98 నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు వివరించింది. ఈరోజు రెండు నోటిఫికేషన్లతో కలిపి వంద నోటిఫికేషన్లు వెలువరించినట్లైందని టిఎస్పిఎస్సీ వర్గాలు వెల్లడించాయి. మూడేళ్ల పండుగ సందర్భంగా భారీ నోటిఫికేషన్లు వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగులు మళ్లీ నిట్టూర్చారు.