హైదరాబాద్: టీడీపికి అనుకూలంగా ఓటు వేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను ప్రలోభపెట్టారని తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్ఠీఫెన్ సన్ ఏసీబీ ప్రత్యేక కోర్టుకు చెప్పారు. చంద్రబాబు ఫోన్ లో నేరుగా తనతో మాట్లాడారని ఆయన చెప్పారు. తానున్నానని, వాళ్లు ఇచ్చిన హామీని నెరవేరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. 

నోటుకు ఓటు కేసులో స్టీఫెన్ సన్ ఫిర్యాదుదారుగా ఉన్నారు. ఆయన గురువారంనాడు ప్రత్యేక కోర్టు ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. టీడీపీ క్రిస్టియన్ సెల్ కన్వీనర్ గా పరిచయం చేసుకున్న సెబాస్టియన్ చంద్రబాబును తనతో మాట్లాడించారని, టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు ఎంత డబ్బు కావాలో చెప్తే ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని సెబాస్టియన్ చెప్పారని స్టీఫెన్ సన్ వివరించారు. 

2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసే విషయంలో చంద్రబాబు నేరుగా మాట్లాడాలనుకుంటున్నారని ఆంథోనీ అనే వ్యక్తి ద్వారా హ్యారీ సెబాస్టియన్ తనను సంప్రదించినట్లు తెలిపారు చంద్రబాబు ప్రతినిధిగా పార్టీలోని కీలకమైన వ్యక్తి వస్తేనే తాను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పానని, దాంతో చంద్రబాబు ప్రతినిధిగా రేవంత్ రెడ్డి మాట్లాడడానికి వస్తారని చెప్పారని ఆయన చెప్పారు. లంచం తీసుకోవడం ఇష్టం లేదని, దాంతో వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించానని ఆయన అన్నారు. 

ఏసీబీ అధికారులు తాము ఉన్న ఫ్లాట్ లో ఐఫోన్ ను, ఇతర ఆడియో, వీడియో పరికరాలను ఏర్పాటు చేసినట్లు స్టీఫెన్ సన్ చెప్పారు. 2015 మే 30వ తేదీన రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహలు తాను ఉన్న ఫ్లాట్ కు వచ్చారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తామని , అడ్వాన్సుగా రూ.50 లక్షలు ఇస్తున్నామని, మిగిలిన డబ్బు ఓటింగ్ తర్వాత ఇస్తామని చెప్పారని ఆయన వివరించారు. 

ఆందులో భాగంగా రూ.2.5 లక్షలుగా ఉన్న 500 రూపాయల బండిళ్లు 20 టీపాయ్ మీద పెట్టారని, వెంటనే ఏసీబీ అధికారులు వచ్చి రేవంత్ రెడ్డిని, ఇతరులను అదుపులోకి తీసుకున్నారని ఆయన చెప్పారు. స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేశారు. 

కాగా, ఇదే కేసులో మరికొందరు సాక్షుల వాంగ్మూలాల నమోదు పూర్తయ్యే వరకు స్టీఫెన్ సన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ప్రక్రియను ఆపాలని రేవంత్ రెడ్ిడ దాఖలు చేసిన పిటిషన్ మీద ఏసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పిటీషన్ మీద కౌంటర్ దాఖలు చేస్తామని కోరడంతో న్యాయమూర్తి విచారణను ఈ నెల 7వ తేదీనకు వాయిదా వేశారు. 

కేసు నుంచి తనను తప్పించాలంటూ తాను దాఖలు చేసుకున్న పిటిషన్ ను ప్రత్యేక కోర్టు కొట్టివేయాడన్ని సవాల్ చేస్తూ మరో నిందితుడు ఉదయసింహ పెట్టుకున్న అప్రీల్ ను హైకోర్టు కొట్టేసింది. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్ాతనే ప్రత్యేక కోర్టు డిశ్చార్జ్ పిటిషన్ ను కొట్టేసిందని, ఈ దశలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.