హైదరాబాద్: సినీ హీరో ప్రభాస్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. హైదరాబాదులోని రాయదుర్గ్ పాన్ మక్తాలో గల 2,083 చదరపు గజాల భూమిని, అతిథి గృహాన్ని తనకు తిరిగి అప్పగించడానికి హైకోర్టు తిరస్కరించింది. అయితే, ప్రభాస్ భూమిని స్వాధీనం చేసుకునే విషయంలో అధికారులు విధివిధానాలను పాటించలేదని మొట్టికాయలు వేసింది. ఎనిమిది వారాల్లోగా ప్రభాస్ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

నిరుడు డిసెంబర్ లో ప్రభాస్ కు చెందిన భూమిని, అతిథిగృహాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్రమబద్దీకరణకు ప్రభాస్ పెట్టుకున్న దరఖాస్తును ఎనిమిది వారాల్లోగా పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ వి. రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ పి. కేశవరావులతో కూడిన డివిజన్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రభాస్ అలియాస్ ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఆ భూమి సిఎస్-7 లిటిగేషన్ జోన్ లో ఉందని తేల్చింది. అయితే, భూమిని స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ అధికారులు తగిన ప్రక్రియను అనుసరించలేదని, బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని అభిప్రాయపడింది.

ప్రభాస్‌ దరఖాస్తు విషయంలో జారీ చేసే ఉత్తర్వుల ఆధారంగా ఈ వందల ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు కోరుతున్న మిగిలిన వారు కూడా అదే రీతిలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని హైకోర్టు తెలిపింది. ప్రభాస్‌ పెట్టుకున్న దరఖాస్తును ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే, ఆ భూమి అతని స్వాధీనమవుతుందంది. ప్రభుత్వం అతని దరఖాస్తును తిరస్కరిస్తే అతను కోర్టును ఆశ్రయించవచ్చునని తెలిపింది. 

భూమి ఎవరి స్వాధీనంలో ఉందో వారు రిజిస్టర్‌ సేల్‌ డీడ్ల ద్వారా ఆ భూములపై సంక్రమించిన హక్కులను వదులుకుని, ప్రభుత్వం నిర్ణయించిన క్రమబద్దీకరణ ఫీజు చెల్లిస్తే, అప్పుడు ప్రభుత్వం ఆ భూములను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని హైకోర్టు తెలిపింది.