తాగండి బాబు.. తాగండి

no sale in bars
Highlights

  • పెద్ద నోట్ల రద్దుతో బార్ల వెలవెల
  • ఎక్సైజ్ శాఖ ఆదాయానికి భారీ గండి
  • పేరుకపోయిన మద్యం నిల్వలు

 

రాష్ట్రంలో నీటికి కష్టాలుంటాయో ఏమో కానీ మద్యానికి మాత్రం ఎలాంటి కష్టాలు ఉండవు. బెల్టు షాపులు పెట్టి ప్రభుత్వమే ప్రతి గల్లీలో మందు సరఫరాకు మౌలిక వసతులు కల్పించింది. దీంతో  ఎక్సైజ్ శాఖ భారీగానే ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది.

 

కానీ, ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో ఎక్సైజ్ శాఖకు, బార్లు, రెస్టారెంట్లు, బెల్లు షాపులకు పెద్ద కష్టమే వచ్చింది. ఎప్పుడు మందుబాబులతో బిజీ బిజీగా ఉండే మద్యం దుకాణాలు ఇప్పుడు వెలవెల బోతున్నాయి.చేతిలో దండిగా డబ్బులున్నా తాగలేని పరిస్థితి మందుబాబులకు ఎదురైంది.


ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పెద్ద నోట్లను చెల్లింపుల కోసం అనుమతిస్తున్న ఎక్సైజ్ శాఖ కు మాత్రం ఎందుకో ఆ అవకాశాన్ని కల్పించలేదు. దీంతో పరిస్థితి తారుమారైంది. ఇన్నాళ్లు రికార్డు స్థాయిలో ఆదాయన్న ఆర్జించిన ఎక్సైజ్ శాఖ ఇప్పుడు చేతులెత్తేసింది.

 

కొత్త కరెన్సీ నోట్లు అందుబాటులోకి రాకపోవడం, ప్రధానంగా చిల్లర సమస్యతో మద్యం వ్యాపారం సరిగా జరగడం లేదు. పెద్ద నోట్లను ఎక్సైజ్ శాఖ బ్రూవరీస్ కార్పొరేషన్ తీసుకోకపోవడం వల్ల అమ్మకాలు తగ్గిపోయాయి.

 

సాధారణంగా రోజుకు రూ. 45 కోట్ల నుంచి రూ. 55 కోట్లు దాకా వ్యాపారం జరుగుతుండేది. కానీ నోట్ల రద్దు వల్ల అది రూ. 20 కోట్లకు పడిపోయింది. బార్లు, రెస్టారెంట్లు, బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు.

 

మరోవైపు అమ్మకాలు తగ్గిపోవడంతో వ్యాపారులు మద్యం నిల్వలను కొనుగోలు చేయడం లేదు. పెద్ద నోట్ల నిషేధం తర్వాత చిన్న నోట్లు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. వినియోగదారులు నిషేధిత పెద్ద నోట్లు తెచ్చి కొనుగోళ్లు చేస్తామంటే వ్యాపారులు తీసుకోవడం లేదు. ప్రతీ నెల మొదటి వారంలో వైన్ షాపులు, రెస్టారెంట్లు, బార్ల నిర్వహకులు భారీ మొత్తంలో మద్యం నిల్వలను కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేస్తారు.

 

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న మద్యాన్నే అమ్మడం కష్టంగా ఉంది. ఇక కొత్తగా మద్యం కొనే పరిస్థితి లేదు. దీంతో ఈ ప్రభావం ఎక్సైజ్ శాఖపై భారీగా పడింది.  

 

 

loader