తెలంగాణలో లాక్‌డౌన్ వుండదని తేల్చిచెప్పారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో కోవిడ్ పరిస్ధితులు, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ తదిరత అంశాలపై ముఖ్యమంత్రి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... లాక్‌డౌన్ విధిస్తే ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుందని సీఎం అన్నారు.

దీనితో పాటు ప్రజా జీవనం కుప్పకూలుతుందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినా పాజిటివ్ కేసులు తగ్గడం లేదని సీఎం వెల్లడించారు. రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్, రెమ్‌డిసివర్‌పై ప్రధానితో ఫోన్‌లో మాట్లాడతానని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు భారీగా కరోనా రోగులు వస్తున్నారని సీఎం తెలిపారు. దీంతో రెమ్‌డిసివర్, వ్యాక్సిన్లు, ఆక్సిజన్‌కు డిమాండ్ పెరుగుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణకు అదనంగా కేంద్రం కేటాయింపులు చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 

కాగా, కరోనా నుండి  తెలంగాణ సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకొన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ తొలిసారిగా గురువారం నాడు ప్రగతి భవన్ కు చేరుకున్నారు. అనంతరం కరోనాపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవలే సీఎం కేసీఆర్ కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే.

మొదటి వేవ్‌లో లాక్‌డౌన్‌తో లక్షల మంది జీవితాలు చెల్లాచెదురయ్యాయని ఆయన గుర్తుచేశారు. లాక్‌డౌన్ విధించినా అత్యవసర సేవలు ఆపేయలేమని కేసీఆర్ వెల్లడించారు. లాక్‌డౌన్‌తో ప్రభుత్వమే భయానక పరిస్ధితిని సృష్టించినట్లవుతుందని సీఎం పేర్కొన్నారు. కేసులు ఎక్కువగా వున్న ప్రాంతాల్లో మైక్రోలెవల్ కంటైన్మెంట్ జోన్లు ప్రకటిస్తామని కేసీఆర్ వెల్లడించారు.

ఉన్నపళంగా పరిశ్రమలు మూసేస్తే ఆగమవుతామని సీఎం అన్నారు. ఆకలి సంక్షోభం.. ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం వుందని కేసీఆర్ హెచ్చరించారు. కరోనా నియంత్రణకు ప్రజలే స్వచ్చందంగా ముందుకు రావాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వైద్య సేవలు మరువలేనివని.. మే 15 తర్వాత కరోనా తీవ్రత తగ్గుతుందని సీఎం జోస్యం చెప్పారు.