ఈడీ, ఐటీ దాడులకు భయపడం:తెలంగాణ మంత్రి హరీష్ రావు
ఈడీ, ఐటీ దాడులకు సంబంధించి తాము భయపడబోమని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ హంత్రి హరీష్ రావు చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిదులు ఇచ్చిందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు.
కరీంనగర్: ఈడీ,ఐటీ దాడులకు భయపడబోమని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ అని ఆయన చెప్పారు. ఇక్కడ మీ బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు. మీ అబద్దాలను నమ్మడానికి ఇది వెట్టి తెలంగాణ కాదు ఉద్యమాల తెలంగాణ అని హరీష్ రావు చెప్పారు. బీజేపీ విడిచిన బాణాలు ఉంటాయన్నారు. బెదిరిస్తే భయపడబోమన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ భవన సముదాయాన్ని పరిశీలించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో చర్చించేందుకు తాను సిద్దంగా ఉన్నానని హరీష్ రావు చెప్పారు. ఈ విషయమై చర్చకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిద్దమా అని ఆయన ప్రశ్నించారు.
జీఎస్టీ కింద తెలంగాణ రాష్ట్రం రూ. 8 వేల కోట్లను ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తక్కువ రాష్ట్రాలకు పంచుతున్న పన్ను 42 శాతంగా చెబుతున్న కేంద్రం కేవలం 29 శాతం మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. రాష్ట్ట్రాల వాటాను తగ్గించారని హరీష్ రావు చెప్పారు.కేంద్ర ప్రభుత్వం నెలకు లక్ష కోట్ల అప్పులు చేస్తుందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమిదన్నర ఏళ్లలో కోటి కోట్ల అప్పులు తెచ్చిందన్నారు. రాష్ట్రాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ నేతలు నోటీకి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు చెప్పారు. వాస్తవాలు మాట్లాడాలని బీజేపీ నేతలకు మంత్రి హరీష్ రావు సలహా ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడతుున్నారని ఆయన సెటైర్లు వేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని కోట్ల నిధులు ఇచ్చిందో చర్చించేందుకు తాను సిద్దంగా ఉన్నానని మంత్రి హరీష్ రావు చెప్పారు.