Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్‌లో బయటపడుతున్న విభేదాలు.. మున్సిపాలిటీల్లో అవిశ్వాస సెగలు.. ఒకేరోజు మూడు చోట్ల..

తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌ పార్టీకి పలు మున్సిపాలిటీలలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. 

no confidence motions in tandur and jawahar nagar municipality
Author
First Published Jan 28, 2023, 6:30 PM IST

తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌ పార్టీకి పలు మున్సిపాలిటీలలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. పలు చోట్ల బీఆర్ఎస్‌లో విభేదాలు బయటపడుతుండగా.. కొన్నిచోట్ల మాత్రం విపక్షాలు ఏకమై తిరుగుబాటు చేసేందుకు సిద్దమయ్యాయి. మూడేళ్ల పదవీకాలం పూర్తికావడంతో మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైస్‌పర్సన్‌లపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. ఈరోజు ఒక్కరోజే మూడు చోట్ల అవిశ్వాస తీర్మానాలకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. 

తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్న పరిమళ్‌పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టినవారిలో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టీజేఎస్‌ పార్టీలకు చెందిన 23 మంది కౌన్సిలర్లు ఉన్నారు.  మరోవైపు మేడ్చల్ జిల్లా జవహర్‌ నగర్ మేయర్‌పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. దాదాపు 20 మంది కౌన్సిలర్లు కలెక్టరేట్‌లో నోటీసులు అందజేశారు. ఇక, పెద్దఅంబర్‌పేట నగరపంచాయితీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్స్‌లపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టినవారిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా ఉన్నారు. 

పురపాలక చట్టం ప్రకారం మూడేళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే గత శాసనసభ సమావేశాల్లో పురపాలక చట్ట సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. నాలుగేళ్ల తర్వాతే అవిశ్వాస తీర్మానాలు పెట్టేలా సవరణ చేసింది. అయితే అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు ఇంకా గవర్నర్ ఆమోద ముద్ర పడలేదు. దీంతో 2020 జనవరి 27న కొలువుదిరిగిన మున్సిపాలిటీ పాలకవర్గాల మూడేళ్ల పదవీకాలం పూర్తికావడంతో..  పలు చోట్ల అధికార బీఆర్‌ఎస్‌కు అవిశ్వాస తీర్మానాల భయం పట్టుకుంది. చాలా చోట్ల చోట్ల చైర్మన్‌, వైఎస్ చైర్మన్‌లపై వ్యతిరేకత.. పదవీకాలం పంపకం.. అదునుకోసం చూస్తున్న ఆశావాహులు.. బీఆర్ఎస్‌లో ముసలానికి కారణం అవుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios