2 నెలల సస్పెన్స్‌కు తెర.. అవిశ్వాసంలో ఓడిన ఛైర్మన్.. లావణ్యకు పరాభవం

First Published 24, Jul 2018, 2:49 PM IST
No Confidence Motion: bhongir municipal chairperson lose her post
Highlights

గత రెండు నెలలుగా సాగిన ఉత్కంఠకు తెరపడింది.. భువనగిరి మున్సిపల్ ఛైర్మన్ లావణ్యపై కౌన్సిల్ సభ్యులు పెట్టిన అవిశ్వాసంలో ఛైర్‌పర్సన్ ఓడిపోయారు

గత రెండు నెలలుగా సాగిన ఉత్కంఠకు తెరపడింది.. భువనగిరి మున్సిపల్ ఛైర్మన్ లావణ్యపై కౌన్సిల్ సభ్యులు పెట్టిన అవిశ్వాసంలో ఛైర్‌పర్సన్ ఓడిపోయారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కౌన్సిల్ హాల్‌లో అవిశ్వాసంపై చర్చ పెట్టి ఓటింగ్ నిర్వహించారు. దీనిలో 21 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే పైల్లా శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

అనంతరం జరిగిన ఓటింగ్‌లో 23 మంది సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా చేతులెత్తడంతో అధికారులు అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లుగా ప్రకటించి.. లావణ్య తన పదవిని కోల్పోయినట్లు తెలిపారు.. త్వరలోనే కొత్త ఛైర్‌పర్సన్‌ను ఎన్నుకునే ప్రక్రియ చేపడతామని ప్రకటించారు. 

వివాదానికి కారణమేంటీ: బీజేపీ నుంచి గెలిచిన ఛైర్మన్ లావణ్య.. టీఆర్ఎస్ పార్టీలో చేరి ఛైర్‌పర్సన్ అయ్యారు. నాలుగేళ్ల పాటు పాలన సాగించి.. ఇటీవల తిరిగి సొంతగూటికి వెళ్లారు.. దీనిపై ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సీరియస్ అవ్వడంతో చివరకు ఆమె పదవి పోయింది. ఈ మొత్తం వ్యవహారానికి తెర వెనుక సూత్రధారి ఎమ్మెల్యేనని భువనగిరిలో చర్చ నడుస్తోంది.

మే 30 వ తేదీన 14 అంశాలతో నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్‌పర్సన్‌తో పాటు అధికార టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల మధ్య చిచ్చు మొదలై.. తారాస్థాయికి చేరింది. అధికార పార్టీతో పాటు కొందరు ప్రతిపక్ష సభ్యులు ఛైర్మన్‌పై అవిశ్వాసాన్ని ప్రతిపాదించి మొత్తం 24 మంది సభ్యుల సంతకాలతో అవిశ్వాస తీర్మానం ప్రతిని జిల్లా కలెక్టర్‌కు అందించారు. కలెక్టర్ ఆదేశాలతో ఇవాళ అవిశ్వాసంపై ఓటింగ్ జరిగింది. 

loader