బీఆర్ఎస్ కు వరుస ఎదురు దెబ్బలు.. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం
బీఆర్ఎస్ (BRS)పార్టీకి మరో సారి ఎదురుదెబ్బ తగిలింది. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ ( Khammam DCCB chairman) పదవిని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ (Congress party) పావులు కదుపుతోంది. అందులో భాగంగా డీసీసీబీ చైర్మన్ బాధ్యత వహిస్తున్న వి.వెంకటాయపాలెం పీఏసీఎస్ డైరెక్టర్ లతో ఆయనపై అవిశ్వాసం (No confidence motion) పెట్టించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓడిపోయిన అనంతరం బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జిల్లాల్లో ఆ పార్టీకి చెందిన నాయకులు రాజీనామాలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. ఇందులో డీసీసీబీ చైర్మన్లు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు అధికంగా ఉంటున్నారు. తాజాగా బెల్లంపల్లి మున్సిపాలిటీలో 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మున్సిపాలిటీ చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం కనిపిస్తోంది.
పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసుంటే బీఆర్ఎస్ గెలిచేది - మాజీ మంత్రి కేటీఆర్
అయితే ఖమ్మం జిల్లాలోనూ ఇప్పుడు బీఆర్ఎస్ కు షాక్ తగలనుంది. ఖమ్మం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా వి.వెంకటాయపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా ఉన్న డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది.
పీఏసీఎస్ లోని 13 మంది డైరెక్టర్లలో 11 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. వారంతా జిల్లా సహకార అధికారి విజయనిర్మలను కలిసి.. నాగభూషణంపై తాము నమ్మకం కోల్పోయారని, ఆయనను పీఏసీఎస్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ నోటీసులు ఇచ్చారు. అందులో పీఏసీఎస్ చైర్మన్ తమకు అందుబాటులో లేరని, అందుకే ఆ పదవిలో కొనసాగడానికి అనర్హులని డైరెక్టర్లు పేర్కొన్నారు.
విమానం డోర్ తెరిచి దూకేసిన ప్రయాణికుడు..
అయితే సాధారణంగా డీసీసీబీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే బ్యాంకు డైరెక్టర్లు చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇదంతా ఎందుకని భావించిన కాంగ్రెస్ నేతలు పీఏసీఎస్ స్థాయిలోనే ఆయనపై అవిశ్వాస తీర్మానానికి ప్లాన్ చేశారు. పీఏసీఎస్ లో నాగభూషణం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోతే పీఏసీఎస్ చైర్మన్ పదవి కోల్పోతారు. దీంతో ఆటోమెటిక్ గా డీసీసీబీ చైర్మన్ పదవిని కూడా కోల్పోవాల్సి వస్తుంది.
పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసుంటే బీఆర్ఎస్ గెలిచేది - మాజీ మంత్రి కేటీఆర్
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం పీఏసీఎస్ నుంచి నాగభూషణం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన డీసీసీబీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. వాస్తవానికి డీసీసీబీ పాలకవర్గం పదవీ కాలం మరో రెండేళ్లలో ముగియనుంది. కానీ అంతకు ముందే చైర్మన్ పదవిని కాంగ్రెస్ నేతను కట్టబెట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే అవిశ్వాస తీర్మానం కోసం 15 రోజుల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంది. దానికి ముందే ఆయనే రాజీనామా చేయబోతున్నారని తెలుస్తోంది.