నిన్న... నయీం తో పోలీసులకు అసలు సబంధాలే లేవు... నేడు... నయీం తో పోలీసులు ఫొటోలు దిగితే తప్పేముందు.. రేపు ... నయీం అసలు గ్యాంగ్ స్టర్ అని ఎవరూ చెప్పారు...  

రౌడీలతో అంటకాగుతూ సర్వీసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుందామనుకునే పోలీసులకు నిజంగా ఇది స్వర్ణయుగం... మళ్లీ ఇలాంటి హోం మంత్రి రాకపోవచ్చు... కాబట్టి త్వరపడండి..

ఎందుకంటే... కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ నయీంతో కలసి కొందరు పోలీసు అధికారులు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అన్ని దినపత్రికల్లోనూ వచ్చాయి.

అయితే వాటి ఆధారంగా పోలీసులపై చర్యలు ఎందుకు తీసుకుంటామని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి పోలీసులను వెనకేసికొచ్చారు.

శుక్రవారం ఏపీలోని విశాటపట్నంకు వచ్చిన ఆయనను నయీంతో పోలీసులు దిగిన ఫొటోలపై విలేకరులు ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు.

పత్రికల్లో వచ్చిన ఫొటోల ఆధారంగా నయీం కేసులో చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. సిట్‌ నివేదిక ఆధారంగానే నయీం కేసులో చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.అయితే గతంలోనే అసెంబ్లీ సాక్షిగా పోలీసులకు నయీంతో ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరో వైపు రాజకీయనేతలతో నయీం కు ఎలాంటి సంబంధం లేదని పోలీసు బాసులు కూడా తేల్చి చెప్పి తమ రుణాన్ని తీర్చుకున్నారు.

ఇప్పటికే నయీం డైరీ కి చదులుపట్టించిన పోలీసులు అందులోంచి ఒక్క విషయం కూడా బయటకి పొక్కకుండా జాగ్రత్త పడుతోంది. అయితే సోషల్ మీడియాలో కొందరు పోలీసులు నయీంతో దిగిన ఫొటోలు వెలుగుచూడడంతో డిపార్ట్ మెంట్ లో కలవరం మొదలైంది. ఇప్పుడు సాక్షాత్తు హోంమంత్రే వత్తాసు పలకడంతో పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.