బతుకమ్మ పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిజామాబాద్ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనాను ఉమ్మడిగా ఎదుర్కొని పండుగను జరుపుకుందామని ఆమె పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. 

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. తీరొక్క పూలతో బతుకమ్మను తీర్చిదిద్ది, ఇంటిల్లిపాదీ సంబరంగా జరుపుకునే ప్రకృతి పండుగ ఇది. రకరకాల పువ్వులతో ఈ తొమ్మిది రోజుల పాటు ముస్తాబయ్యే  బతుకమ్మ ...సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే.

వందల ఏళ్ళ నుంచి మన  ఆడబిడ్డలు ఘనంగా జరుపుకుంటున్న  బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి ఓ వేడుకగా టీ. ఆర్. ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఒక అన్నగా, ఒక కొడుకుగా, రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచుకు ఈ పండుగ వేళ, చీర రూపంలో చిరుకానుకను మన సీఎం కేసీఆర్ అందిస్తున్నారు.  

ప్రతీ ఏడాది మన ఆడబిడ్డలంతా ఒక్క దగ్గర జమై ఉత్సాహంగా జరుపుకనే బతుకమ్మ పండుగను ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలతో జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రపంచాన్ని నాలుగు గోడల మధ్యకు నెట్టిన కరోనానే ఇందుకు కారణం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఏడాది వైభవంగా నిర్వహించే బతుకమ్మ వేడుకలను ఇదే కారణంతో నిర్వహించలేకపోతున్నాము. 

కరోనా నేపథ్యంలో మీరు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బతుకమ్మ పండుగను జరుపుకోవాలని మనవి చేస్తున్నాను. సామాజిక దూరం పాటిస్తూ, ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.   

బతుకమ్మ పండుగ స్పూర్తితో, మనమందరం ఉమ్మడిగా కరోనాను ఎదుర్కొందాం. సురక్షితంగా...సంతోషంగా పండుగను జరుపుకుందాం.
రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు...

జై తెలంగాణ