న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)పై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎస్ఆర్టీసీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. 

రోడ్డు రవాణా సంస్థల చట్టం - 150 సెక్షన్ 39 ప్రకారం ఏపీఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలను మూసివేయాలన్నా, వ్యవస్థాగతంగా వాటిలో మార్చులు చేయాలన్నా కచ్చితంగా కేంద్రం అనుమతి అవసరమని గడ్కరీ తెలిపారు. 

Also Read: RTC Strike: ఒకే దెబ్బ, కీలెరిగి వాత పెట్టిన కేసీఆర్

బిజెపి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఆయన ఆ విషయాలు చెప్పారు. ఆర్టీసీపై కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే కేసీఆర్ టీఎస్ఆర్టీసీలో వ్యవస్థాగత మార్పులు చేయాలనే నిర్ణయం నుంచి వెనక్కి తగ్గినట్లు భావిస్తున్నారు. 

టీఎస్ ఆర్టీసీలోని సగం రూట్లను ప్రైవేట్ పరం చేయాలని కేసీఆర్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది కూడా. ఆర్టీసీ కార్మికులు దిగిరాకపోతే మొత్తం ఆర్టీసీయే ఉనికిలో ఉండదని కూడా ఆర్టీసీ సమ్మె కాలంలో కేసీఆర్ హెచ్చరించారు. అయితే, కేంద్రం మెలిక పెట్టిన కారణంగానే కేసీఆర్ వెనక్కి తగ్గి మొత్తం వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ఎత్తు వేసినట్లు భావిస్తున్నారు. 

Also Read: కేసీఆర్ కొత్త పిట్టకథ : రామాయణం టు కలియుగం

ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరించబోమని చెబుతూ సమ్మె చేస్తున్న కార్మికులందరినీ విధుల్లోకి తీసుకున్నారు. పైగా, అడగకుండానే వారికి ఆఫర్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్న కారణంగానే కేసీఆర్ తన ప్రణాళికను మార్చుకున్నట్లు చెబుతున్నారు.