మృగాళ్ల దాష్టీకానికి బలైపోయిన సమత కేసులో నిందితులకు మరణశిక్ష విధించాలంటూ ఆమె స్వగ్రామం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లె యెల్లాపూర్‌ వద్ద హిందూ పెద్దలు హోమం నిర్వహించారు.

ఆదిలాబాద్‌లోని నవశక్తి దుర్గామాతా ఆలయానికి చెందిన కిషన్ మహారాజ్‌తో పాటు మరికొందరు పూజారులు, వారి శిష్య బృందం శనివారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హోమం, ఇతర క్రతువులను నిర్వహించారు.

Also Read:సమత కేసులో తుది తీర్పు ఈ నెల 30కి వాయిదా

సాధారణంగా ఇలాంటి కర్మలను ఆలయాల్లోనో లేదంటే ఇతర పవిత్ర ప్రదేశాల్లోనో చేస్తారు. అయితే ఈ పూజారులు స్వయంగా బాధితురాలి ఇంటికి వచ్చి హోమం చేయడం విశేషం. క్రతువు ముగిసిన వెంటనే బాధితుల బంధువులకు వారు పవిత్రమైన దారాలను అందించారు. అలాగే వారితో పాటు కొన్ని శ్లోకాలను చెప్పించారు.

షెడ్యూల్డ్ కులాల్లో అత్యంత వెనుకబడిన బుడగ జంగాల వర్గానికి చెందిన బాధితురాలు స్థానికంగా బెలూన్లు, పాత్రలను విక్రయించేది. అలాగే జీవనోపాధి కోసం వ్యర్ధమైన జుట్టును సేకరించేది.

ఈ క్రమంలో గతేడాది నవంబర్ 19న సమతపై షేక్ బాబు, సేక్ షాబోద్దీన్, షేక్ ముక్దుంలు ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు అనంతరం గొంతుకోసం దారుణంగా హత్య చేశారు. ఈ కేసు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారడంతో పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

వరుసగా ఇద్దరు వ్యక్తులు మరణించడంతో కుటుంబంలో శాంతిని కలిగించే ఉద్దేశ్యంతో హోమం నిర్వహించామని, సమతను బలి తీసుకున్న నిందితులకు మరణశిక్ష విధించాలని ప్రార్ధించినట్లు కిషన్ మహారాజ్‌ నేతృత్వంలోని మతపెద్దలు తనతో చెప్పినట్లు సమత అత్త మీడియాకు తెలిపారు.

Also Read:సమతపై గ్యాంగ్ రేప్: నిందితుల తరపున వాదించేందుకు ముందుకురాని లాయర్లు

సమత హత్య జరిగిన 20 రోజులకే తన భర్త అనారోగ్యంతో మరణించాడని ఆమె తెలిపింది. మహారాజ్ తమ కుటుంబసభ్యలను ఇంటి నుంచి బయటకు రావొద్దని చెప్పారని, ఎందుకంటే ప్రస్తుతం బయట భయంకరమైన రోజులు నడుస్తున్నాయని, త్వరలోనే అంతా మంచి జరుగుతుందన్నారని ఆమె వెల్లడించారు.

అంతేకాకుండా వారు తమకు కొన్ని సేఫ్టీ స్ప్రే బాటిల్స్ కూడా ఇచ్చారని, ఆపద సమయంలో వాటిని ఉపయోగించమని చెప్పినట్లు తెలిపింది. కాగా బాధితురాలి కుటుంబాన్ని ఆదిలాబాద్‌లోని దుర్గా ఆలయానికి రావాల్సిందిగా కోరారని, తమ కుటుంబ శ్రేయస్సు కోసం తాను మరికొన్ని పూజలు చేస్తానని వాగ్ధానం చేసినట్లు తెలిపింది.