హైదరాబాద్: వైద్యోనారాయణో హరి అనే నానుడికి కళంకం తెచ్చేలా ప్రవర్తించారు నీలోఫర్ ఆస్పత్రిలోని ప్రొఫెసర్లు. ప్రాణం పోయాల్సిన వైద్యులు చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చికిత్స కోసం వచ్చే అన్నెంపున్నెం ఎరుగని చిన్నారులపై క్లీనికల్ ట్రయల్స్ ప్రయోగం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. 

నీలోఫర్ ఆస్పత్రి అంటే పేరొందిన ఆస్పత్రి కావడంతో ప్రతీ ఒక్కరూ తమ చిన్నారులను చూపించేందుకు క్యూ కడుతుంటారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది చిన్నారులను వైద్య చికిత్స నిమిత్తం తీసుకువస్తుంటారు. ఓపీ సైతం భారీగానే ఉంటుంది. 

ఈ రద్దీని క్యాష్ చేసుకుని కొందరు ప్రొఫెసర్లు క్లీనికల్ ట్రయల్స్ కు పాల్పడుతున్నారు. ఫార్మా కంపెనీలు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి క్లీనకల్ ట్రయల్స్ ప్రయోగిస్తూ ఇదే వ్యాపారంగా సొమ్ము చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇప్పటి వరకు సుమారు 50 మంది చిన్నారులపై క్లీనికల్ ట్రయల్స్ ప్రయోగించినట్లు తెలుస్తోంది. క్లీనికల్ ట్రయల్స్ బారిన పడిన చిన్నారులు తీవ్ర అనారోగ్యం పాలైనట్లు కూడా ప్రచారం జరుగుతుంది. 

అయితే డబ్బుల పంపిణీలో తేడాలు రావడంతో ఈ వ్యవహారం కాస్త బట్టబయలైంది. ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. క్లీనికల్ ట్రయల్స్ వార్తలు రావడంతో ఆస్పత్రిలో విచారణకు ఆదేశించింది. ముగ్గురు ప్రొఫెసర్ల మధ్య నెలకొన్న విబేధాలతో ఈ వ్యవహారం బయటకు వచ్చినట్లు సమాచారం.