తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఆకస్మిక సోదాలు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు పౌర హక్కుల నేతలు, న్యాయవాదుల ఇళ్లలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఆకస్మిక సోదాలు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు పౌర హక్కుల నేతలు, న్యాయవాదుల ఇళ్లలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. దాదాపు 15 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరుగుతున్నాయి. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఈ సోదాలు జరుగుతుపుతున్నట్టుగా తెలుస్తోంది. మానవ హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న నాయకుల ఇళ్లలో ఈ తనిఖీలు చేపట్టింది.
హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో పౌరహక్కుల సంఘం నాయకుడు, న్యాయవాది సురేష్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. న్యాయవాది సురేష్‌తో పాటు అతని బంధుమిత్రుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. తిరుపతిలో న్యాయవాది క్రాంతి చైతన్య నివాసంలో సోదాలు చేపట్టారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కుల నిర్మూల పోరాట సమితి నాయకుడు దుడ్డు వెంకట్రావు నివాసంలో కూడా ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.
నెల్లూరు ఉస్మాన్ సాహెబ్‌పేటలోని ఏపీసీఎల్‌సీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు నివాసంలో కూడా ఎన్‌ఐఏ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. వెంకటేశ్వర్లు రెండు దశాబ్ధాలుగా పౌరహక్కుల ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నారు. గుంటూరు జిల్లాలో కూడా ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. టి రాజారావు ఇంట్లో ఎన్‌ఐఏ బృందం సోదాలు జరుపుతుంది. రాజారావు కు చెందిన ప్రజా వైద్యశాలకు తెల్లవారుజామున చేరుకున్న ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడకు పెద్ద ఎత్తున వచ్చిన ప్రత్యేక బలగాలు ఆయన నివాసం హాస్పిటల్ చుట్టుపక్కలకు ఎవరిని రాకుండా మొహరించారు.
