హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మంగళవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. 

ప్రాజెక్టు నిర్మాణం పూర్తైనందున ఉపశమన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఎన్జీటీ. పర్యావరణ ప్రభావ మదింపు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్టు ఎన్జీటీ ప్రకటించింది.

పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు గుర్తించినట్టుగా ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

2008-2017 వరకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు కమిటీ నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ కోరింది. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం అంశాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.

 ఈ విషయమై ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. 2008 నుండి 2017 వరకు పర్యావరణ అనుమతుల లేకుండా చేసిన నిర్మాణాలకు జరిగిన పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది.

కమిటీ పురోగతిని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ట్రిబ్యునల్ కోరింది.ప్రాజెక్టు విస్తరణపై సీడబ్ల్యుసీ నిర్ణయం మేరకు పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని తేల్చి చెప్పింది.