తెలంగాణ ప్రభుత్వానికి ఎన్టీటీ షాక్: రూ. 3800 కోట్ల జరిమానా
తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సోమవారం నాడు రూ. 3800 కోట్ల జరిమానా విధించింది.వ్యర్థాల నిర్వహణపై మార్గదర్శకాలు అమలు చేయకపోవడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సోమవారం నాడు రూ.3800 కోట్ల జరిమానాను విధించింది. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎన్జీటీ.
1996లో మున్సిపాలిటీల్లో పారిశుధ్య వ్యర్ధాల నిర్వహణ సరిగా లేదని పర్యావరణ సురక్షా అనే స్వచ్చంధ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఘన,ద్రవ వ్యర్ధాల నిర్వహణపై అన్ని రాష్ట్రాలకు ఎన్జీటీ నోటీసులు పంపింది. అయితే ఈ విషయమై అన్ని రాష్ట్రాల నుండి సమాధానాలను ఎన్జీటీ పరిశీలించింది. తెలంగాణ నుండి వచ్చిన సమాధానం సంతృప్తిగా లేకపోవడంతో ఎన్జీటీ రూ. 3800 కోట్లు జరిమానాను విధించింది. ఈ జరిమానాను రెండు నెలల్లో డిపాజిట్ చేయాలని ఎన్జీటీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.