హైదరాబాద్: తెలంగాణ సచివాలయం భవనాల కూల్చివేతతో ఏర్పడే వ్యర్థాలు, వాయు కాలుష్యంపై అధ్యయనం చేసేందుకు కమిటిని ఏర్పాటు చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈ మేరకు ఎన్‌జీటీ సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఈ నెల 16వ తేదీన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచీలో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై సోమవారం నాడు ఎన్‌జీటీ విచారించింది. సచివాలయం కూల్చివేత విషయంలో జోక్యం చేసుకోవడానికి మాత్రం గ్రీన్ ట్రిబ్యునల్ నిరాకరించింది. సచివాలయంలో భవనాల కూల్చివేత కారణంగా ఏర్పడే వ్యర్థాల నిర్వహణపై మాత్రం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ట్రిబ్యునల్ ప్రకటించింది.

రేవంత్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది రాజ్ పంజ్వాని, న్యాయవాదులు శ్రావణ్ కుమార్, ఆగ్నేయ్ వాదనలు విన్పించారు. సచివాలయ కూల్చివేత వల్ల ఉత్పన్నమయ్యే వ్యర్థాలు, వాయు కాలుష్యంపై అధ్యయనం చేసేందుకు జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలో ద్విసభ్య బెంచ్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

also read:తెలంగాణ సచివాలయం కూల్చివేత: ఎన్జీటీలో రేవంత్ రెడ్డి పిటిషన్

కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ హైద్రాబాద్ కు చెందిన నిపుణులతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్‌జీటీ ఆదేశించింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీకి వాయిదా వేసింది.

తెలంగాణ సచివాలయం కూల్చివేత విషయమై తెలంగాణ హైకోర్టు నిర్ణయం తర్వాత తాము ఈ విషయమై విచారణ చేపడుతామని ఈ నెల 16వ తేదీన ఎన్‌జీటీ ప్రకటించింది. ఈ నెల 17వ తేదీన సచివాలయం కూల్చివేతకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది ట్రిబ్యునల్.