ఇప్పటికే భారీ వర్షాలతో తెలంగాణ ప్రజలు తడిసి ముద్దవగా మరో రెండ్రోజులు వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు వీడటం లేదు. కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే ప్రజలు తడిసి ముద్దవుతున్నారు. నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా ప్రాజెక్ట్ లు, చెరువులు నిండుకుండల్లా మారాయి. అయితే గత రెండ్రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు కాస్త తేరుకుంటుండగా వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. రాష్ట్రంలో మరో రెండురోజులు(సోమ, మంగళవారం) మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇవాళ(సోమవారం) తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు(మంగళవారం) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. మంచిర్యాల, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ చేసారు.
నిన్న(ఆదివారం) హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 40.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి వుండగం 55.91 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది.
Read More అల్లూరి జిల్లాను ముంచెత్తిన గోదావరి వరద నీరు: ముంపులోనే 115 గిరిజన గ్రామాలు
ఇక వర్షాలు కాస్త తగ్గడంతో గోదావరి నదికి వరద ప్రవాహం కూడా తగ్గింది. దీంతో భద్రాచలం వద్ద నీటిమట్టం 46 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. అయితే మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం వుందన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో పూర్తిస్థాయిలో వరద తగ్గేవరకు ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరో వైపు గోదావరి వరద ప్రవాహంతో భద్రాచలం పట్టణంలోని కొన్ని కాలనీల్లో వరద ముంచెత్తింది. వరద బాధిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం పట్టణంలో ఐదు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. భద్రాచలం నుండి దిగువకు గోదావరి ఉరకలెత్తుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో లంక గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ధవళేశ్వరంకు 15 లక్షల క్యూసెక్కుల ఇన్ ప్లో వస్తుండగా వచ్చిన నీటిని వచ్చినట్లే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ నీరంతా పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాల మీదుగా సముద్రంలోకి ప్రవహిస్తుంది. గోదావరి నదికి వరద పోటెత్తిన కారణంగా అధికారులు లంక గ్రామాల ప్రజలను ఇప్పటికే అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
