అల్లూరి జిల్లాను ముంచెత్తిన గోదావరి వరద నీరు: ముంపులోనే 115 గిరిజన గ్రామాలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో గిరిజన గ్రామాలు నీటమునిగాయి. దీంతో స్థానికులు వరద నీటిలో ఇబ్బంది పడుతున్నారు
ఖమ్మం:అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, ఏటపాక మండలాలను గోదావరి వరద నీరు ముంచెత్తింది. దీంతో 115 గిరిజన గ్రామాలు వరద నీటిలో మునిగాయి. వారం రోజులుగా గోదావరి నదికి వరద పోటెత్తింది. ఎగువ నుండి ప్రవహిస్తున్న వరద నీరు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లోని గిరిజన గ్రామాలను ముంచెత్తింది.
వారం రోజులుగా గోదావరి వరద నీరు ముంచెత్తడంతో గిరిజనులు అత్యవసరమైతే పడవల ద్వారా బయటకు వస్తున్నారు. వారం రోజులుగా గోదావరికి వరద పోటెత్తింది. దీంతో నిత్యావసరుకుల కోసం గిరిజన గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.గోదావరికి వరద పోటెత్తిన కారణంగా తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
గత ఏడాది కూడ గోదావరికి వరద పోటెత్తింది. దీంతో విలీన మండలాల గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. గత ఏడాది జూలై మొదటివారంలోనే గోదావరికి భారీ వరదలు వచ్చాయి. గోదావరి నది భద్రాచలం వద్ద 70 అడుగుల ఎత్తులో ప్రవహించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 56.9 అడుగుల ఎత్తులో ప్రవహించింది.
also read:భద్రాచలం వద్ద 54.7 అడుగులకు చేరిన గోదావరి: వరద ముంపులోనే గిరిజన గ్రామాలు
విలీన మండలాల గిరిజన గ్రామాలకు పడవల ద్వారా నిత్యావసర సరుకులు పంపాలని స్థానికులు కోరుతున్నారు.
రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే గోదావరికి వరద పోటెత్తే అవకాశం ఉంది. వర్షాకాలం ఆరంభంలోనే గోదావరికి భారీగా వరదలు రావడంతో వరద తీవ్రంగా ఉందని ముంపు గ్రామాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.