హైదరాబాద్: నేటి(మంగళవారం)నుంచి అయిదు రోజుల పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కోస్తాంధ్రలో కూడా ఇదే పరిస్థితి వుంటుందని...రాయలసీమలో మాత్రం చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపింది. 

మంగళ, బుధవారాలు ఉరుములతో కూడిన భారీ జల్లులు తెలుగు ప్రాంతాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రెండు రోజులు దక్షిణ బంగాళాఖాతంలో, తర్వాత మధ్య బంగాళాఖాతంలో 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని... కాబట్టి మత్స్యకారులు ఆ దిశగా వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. 

ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నారు. ప్రతిసారి దోబూచులాడే రుతుపవనాలు ఈసారి అనుకున్న సమయానికి తెలుగు రాష్ట్రాలను తాకాయి. దీంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు.