లవ్ ఫెయిల్యూర్ కారణంగా ఓ న్యూస్ రిపోర్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాద్ లో ని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సిద్ధిపేట ప్రాంతానికి చెందిన పయ్యావుల రాములు కూతురు పి.కళ్యాణి(26) నగరంలోని ఓ న్యూస్‌ చానల్‌లో పనిచేస్తున్నది. కళ్యాణి అదే సంస్థలో పనిచేస్తున్న శివ అనే యువకుడిని ప్రేమించిందని పోలీసులు చెప్పారు. రెండు సంవత్సరాలుగా వీరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.

అయితే.. ఇటీవల కళ్యాణి.. పెళ్లి చేసుకోవాలంటూ శివని కోరింది. ఆ యుకువడు నిరాకరించడంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కళ్యాణి తన సోదరుడు సుమన్‌తో కలిసి బోలక్‌పూర్‌లో ఉంటున్నారు. 

ఓ బార్బర్‌ షాపులో పనిచేస్తున్న సోదరుడు ఉదయం విధులకు వెళ్లాడు. రాత్రి వచ్చి చూసే సరిగా ఇంట్లో కళ్యాణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగుచూసింది. వెంటనే గాంధీనగర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టమ్‌ నిర్వహించి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కాగా.. కళ్యాణి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.