తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన నవ వధువు కిడ్నాప్‌ కేసును 24 గంటల వ్యవధిలోనే పోలీసులు చేధించారు. జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామంలో సోమవారం మధ్యాహ్నం కిడ్నాపైన నవ వధువును పోలీసుల రక్షించారు.

జగిత్యాల రూరల్‌ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన వేముల రాకేశ్, సారంగాపూర్‌ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన కొంపల సమత ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.

దీంతో ఈ నెల 7న మల్యాల మండలం ఒబులాపూర్‌ వీరభద్రస్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అదే రోజు తమకు రక్షణ కావాలంటూ నూతన జంట సారంగాపూర్‌ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు యువతి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ చేశారు. దంపతులు రాకేశ్‌–సమత పొరండ్ల గ్రామంలో ఉంటున్నారు.

సోమవారం మధ్యాహ్నం సమత సోదరుడు సాయికుమార్‌తో పాటు మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన బుర్రల ప్రవీణ్‌ కారులో పొరండ్ల గ్రామానికి వచ్చి మరో నలుగురు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చి రాకేశ్, అతని కుటుంబ సభ్యులపై దాడిచేసి సమతను బలవంతంగా కారులో తీసుకెళ్లారు.

దీంతో భర్త వేముల రాకేశ్‌ జగిత్యాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో కిడ్నాపర్ల చెరనుంచి బాధితురాలిని విడిపించారు.