Asianet News TeluguAsianet News Telugu

ఫోన్ వ్యసనం.. తగ్గించుకోవాలన్నందుకు నవ వధువు ఆత్మహత్య..

కొత్తగా పెళ్లయిన ఓ యువతి ఫోన్ అలవాటు మార్చుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఫోన్ వాడొద్దని భర్త వారించినందుకు దారుణానికి ఒడిగట్టింది.

Newly married bride commits suicide in hyderabad
Author
First Published Dec 9, 2022, 8:14 AM IST

హైదరాబాద్ : స్మార్ట్ ఫోన్ విషయంలో ఏర్పడిన గొడవ ఓ నవ వధువు ప్రాణాలు తీసింది. పెళ్ళయిన రెండు నెలలకే ఆమె బలవన్మరణానికి పాల్పడింది. దీంతో వారి ఇంట విషాదం  నెలకొంది. ఈ ఘటన జీడిమెట్లలో చోటు చేసుకుంది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వై రామకృష్ణ ఆమె ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను ఇలా చెప్పుకొచ్చారు… మృతురాలి పేరు శైలు. విజయవాడకు చెందిన కమల, జనార్దన్ రెడ్డి దంపతుల కుమార్తె. ఆమెను వైఎస్ఆర్ జిల్లా పులివెందులకు చెందిన ఓబుల్ రెడ్డి కొడుకు గంగా ప్రసాద్ రెడ్డికి ఇచ్చి ఈ ఏడాది అక్టోబర్ 16న పెళ్లి జరిపించారు. 

ప్రసాద్ రెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో పెళ్లి అయిన తర్వాత వీరిద్దరూ హైదరాబాదుకు వచ్చారు. చింతల్ శ్రీ సాయి నగర్ లో కాపురం పెట్టారు. శైలు (20) ఫోన్ ఎక్కువగా వాడుతుంది. కరోనా లాక్డౌన్ సమయంలో..  అది ఆమెకు వ్యసనంగా మారింది. దీంతో తల్లిదండ్రులు వారించే వారు, అలవాటు మానుకొమ్మని హెచ్చరించేవారు. కానీ ఆమె ఫోన్ ను వదిలిపెట్టలేదు. పెళ్లి అయితే ఆమె అలవాటును మానుకుంటుంది అనుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఆమె తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఎప్పుడూ ఫోన్ చూస్తూ ఉండడం, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తూ ఉండేది. ఇంటిని కూడా పట్టించుకోకుండా భార్య చేసే పని భర్త గంగాప్రసాద్ కు నచ్చలేదు. 

కొత్త మెట్రో లైన్ తో ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసీఆర్ పన్నాగం: కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి

ఎప్పుడు చూసినా స్మార్ట్ఫోన్లో గడుపుతుండటం, రీల్స్ చేస్తుండడంతో ఆమెను వారించేవాడు. ఫోన్ కు దూరంగా ఉండాలని పలుమార్లు నచ్చజెప్పాడు. అయినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. భార్య మరీ ఫోన్ కు బానిసగా మారుతుండడం.. కొత్తగా పెళ్లయిన ఉత్సాహం లేకుండా ఉండటంతో.. భర్త.. వారం రోజుల కిందట  ఆమె స్మార్ట్ ఫోన్ కు కొత్త పాస్వర్డ్ సెట్ చేసి.. అది ఆమె తీయకుండా లాక్ చేశాడు. దీంతో ఆమెకు ఎటూ పాలుపోలేదు. బుధవారం రాత్రి తన ఫోన్ లాక్ తొలగించాలని భర్తను కోరింది. అతను ఒప్పుకోకపోవడంతో అలా చేయకపోతే తాను చచ్చిపోతానని బెదిరించింది.

దీంతో భర్త భయాందోళనలకు గురి అయ్యాడు. శైలు తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆమె వినకపోవడంతో శైలు తల్లి విజయవాడ నుంచి హైదరాబాద్కు కూతురి దగ్గరికి వచ్చేందుకు రెడీ అయ్యింది. అంతలోనే గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బిల్డింగ్ మీద నుంచి దూకి శైలు ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios