సిబ్బంది పొరపాటు: మహబూబాబాద్ ఆసుపత్రిలో శిశువులు తారుమారు, చివరికి...
మహబూబాబాద్ ఆసుపత్రిలో సిబ్బంది పొరపాటు కారణంగా శిశువులు తారుమారయ్యారు. అయితే చివరికి కథ సుఖాంతమైంది.
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో శిశువుల తారుమారు ఘటన కలకలం రేపుతుంది. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించి ఆసుపత్రి సిబ్బంది ఎవరి శిశువులను వారికే అప్పగించడంతో పేరేంట్స్ శాంతించారు.మహబూబాబాద్ జిల్లా గొల్లపల్లి గ్రామానికి చెందిన సుమిత్ర ఈ ఏడాది జూలై 31న మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో డెలీవరి అయింది. సుమిత్రకు కొడుకు పుట్టాడు. పుట్టిన చిన్నారికి పచ్చకామెర్లు రావడంతో చిన్నారిని ఇంక్యుబేటర్ లో ఉంచారు.
అయితే అదే ఆసుపత్రిలో మరో మహిళ డెలీవరి అయింది. ఈ మహిళ పాపకు జన్మనిచ్చింది. ఈ చిన్నారికి శ్వాస సంబంధమైన సమస్య తలెత్తడంతో సుమిత్ర కొడుకు స్థానంలో ఈ చిన్నారిని ఉంచారు. అయితే తన కొడుకు పాలు పట్టేందుకు సుమిత్ర ఇంక్యుబేటర్ ఉన్న ప్రాంతానికి వెళ్లింది. కొడుకు స్థానంలో కూతురు ఉండడంతో షాక్ కు గురైంది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపింది. సుమిత్ర భర్త, సుమిత్ర తల్లి ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. కొడుకు పుడితే బిడ్డగా ఎలా మారిందని ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు.
ఆసుపత్రి సిబ్బంది ఈ విషయమై విచారణ జరిపారు. పొరపాటున సుమిత్ర కొడుకు స్థానంలో మరో మహిళ కూతురుకు చికిత్స అందిస్తున్న విషయం తేలింది. పొరపాటును ఆసుపత్రి సిబ్బంది అంగీకరించారు. ఈ విషయమై సుమిత్ర కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా చూసుకుంటామని ఆసుపత్రి సిబ్బంది హామీ ఇచ్చారు. సుమిత్రకు కొడుకును అప్పగించారు. మరో మహిళకు పుట్టిన కూతురును ఆమెకు అప్పగించారు