ప్రీతి మృతికి రూ. 50 లక్షల అడ్మిషన్ బాండ్ కూడా కారణమేనా? వెలుగులోకి కొత్త ట్విస్ట్.. చివరిమాటల్లో ఏముంది??
డాక్టర్ ప్రీతి మృతి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. పీజీలో చేరేముందు రూ.50లక్షలు అడ్మిషన్ బాండ్ ఇవ్వాల్సిఉంటుందని.. మధ్యలో కోర్సు ఆపేస్తే ఆ మొత్తాన్ని కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి చెల్లించాల్సి ఉంటుందనే చర్చ తెరమీదికి వచ్చింది.
వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా గతవారం రోజులుగా సంచలనంగా మారిన కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఎంబీబీఎస్ పీజీ సీటు కోసం 50 లక్షల రూపాయల బాండ్ ముందుగానే రాయడం కూడా ఆమె ఆత్మహత్యాయత్నానికి మరో కారణం కూడా అయి ఉంటుందని కొన్ని మీడియాల్లో వార్తా కథనాలు వెలువడుతున్నాయి. వీటి ప్రకారం..ఎంబిబిఎస్ పీజీ సీటు రావడం ఒక ఎత్తు. అయితే ఆ మూడేళ్ల కోర్సు పూర్తి చేయడం విద్యార్థులకు మరో ఎత్తుగా ఉంటుందని అంటున్నారు.
ఇటు తరగతులకు హాజరవుతుండాలి.. అటు ప్రాక్టికల్ గా కు సీనియర్లతో కలిసి ఆసుపత్రిలో పనిచేయాలి. వారి ఆలోచనలకు తగ్గట్టుగా నడుచుకోవాలి. ఇవన్నీ పీజీ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యే విద్యార్థులకు ఒక ఛాలెంజ్ లాగానే ఉంటుంది. వీటికి తోడు ఆకతాయిల వేధింపులు. కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులోనూ ఇలాంటిదే జరిగిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. పీజీ సీటు వచ్చిన సమయంలో అడ్మిషన్ బాండ్ కింద విద్యార్థులు రూ. 50లక్షల అగ్రిమెంట్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది.
పీజీ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఏదైనా కారణాలతో కోర్సును మధ్యలో ఆపేస్తే.. ఆ మొత్తాన్ని కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారణమే ప్రీతి పాలిట శాపంగా మారిందన్న కథనాలు కొన్ని మీడియాల్లో వస్తున్నాయి. నిరుడు యూనివర్సిటీ మెడికల్ పీజీ సీటు మధ్యలో ఆపేస్తే రూ.20 లక్షలు చెల్లించాలన్న నిబంధన ఉండేది. అయితే, ఈ ఏడు రాష్ట్ర ప్రభుత్వం దీనిని రూ. 50 లక్షలకు పెంచింది. దీనికి కారణం చాలామంది విద్యార్థులు పీజీ కోర్సు మధ్యలోనే వదిలి వెళ్లిపోవడమే.
ఈ భారాన్ని మోయలేకనే యూనివర్సిటీలో పిజి కోర్సులో చేరిన చాలామంది విద్యార్థులు ర్యాగింగ్, వేధింపులు, ఇంకా అలాంటి ఏవైనా సమస్యలు ఎదురైనా కూడా వాటిని భరిస్తూ ఎలాగో పీజీ విద్యని పూర్తి చేస్తున్నారు... అనే వాదనలు విశ్వవిద్యాలయంలో వినిపిస్తున్నాయి. ప్రీతి విషయంలోనూ ఇదే జరిగిందనేది ఇప్పుడు తెరమీదికి వస్తున్న కొత్త వాదన. సైఫ్ నుంచి ప్రీతికి వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో.. ప్రీతి తండ్రి నరేందర్ పిజి కోర్సు ఆపేసి వచ్చేయమని చెప్పినట్లుగా.. కానీ ప్రీతి.. మధ్యలో వదిలేస్తే రూ.50 లక్షలు యూనివర్సిటీకి చెల్లించాల్సి ఉంటుంది కదా.. ఆ మొత్తాన్ని ఎలా అడ్జస్ట్ చేస్తావు అని తండ్రిని అడిగినట్టు.. ఆమె చివరి మాటల్లో ఈ సంభాషణ జరిగినట్లుగా.. ఇప్పుడు కొత్తగా చర్చ జరుగుతుంది.
ప్రీతి ఆత్మహత్యాయత్నం, మృతి ఘటన నేపథ్యంలో విద్యార్థినుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ నిబంధనలు తమ పిల్లలను మానసికఒత్తిడికి గురి చేస్తాయని వారు భయపడుతున్నారు. అందుకే యూనివర్సిటీలో వేధింపులు, ర్యాగింగ్ లపై.. ప్రభుత్వం విద్యార్థినులకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని లేదా కొత్త అడ్మిషన్ బాండ్ నిబంధనలు తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.