Asianet News TeluguAsianet News Telugu

‘ఆ నలుగురే మా చావులకు కారణం.. కఠినంగా శిక్షించండి’.. సూసైడ్ నోట్‌లో పప్పుల సురేష్..

తెలంగాణలో నిజామాబాద్‌కు చెందిన పప్పుల సురేష్ (Pappula Suresh) కుటుంబం విజయవాడలో (Viajyawada) ఆత్మహత్యకు (Suicide) పాల్పడటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి సురేష్ సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. 
 

new twist in Nizamabad Family Suicide Case Suresh suicide note came into light
Author
Nizamabad, First Published Jan 10, 2022, 11:19 AM IST

తెలంగాణలో నిజామాబాద్‌కు చెందిన పప్పుల సురేష్ (Pappula Suresh) కుటుంబం విజయవాడలో ఆత్మహత్యకు (Suicide) పాల్పడటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చిన సురేష్,  ఆయన భార్య శ్రీలత, కొడుకులు అఖిల్‌, ఆశీష్‌లు శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపులే వారి ఆత్మహత్యలకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి సురేష్ సూసైడ్ నోట్, సెల్పీ వీడియో బయటకు వచ్చాయి. విజయవాడలో సురేష్ ఫ్యామిలీ బస చేసిన కన్యకా పరమేశ్వరి సత్రంలో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకన్నారు. అందులో సురేష్ నలుగురి పేర్లను ప్రధానంగా ప్రస్తావించాడు. తన భార్య, పిల్లల చావుకు నిజామాబాద్‌కు చెందిన జ్ఞానేశ్వర్‌, గణేశ్‌, నిర్మల్‌కు చెందిన వినీత, చంద్రశేఖర్‌ కారణమని ఆరోపించాడు. వారిని కఠినంగా శిక్షించాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. 

మరోవైపు చనిపోయే ముందు సురేష్ సెల్ఫీ వీడియో‌లో పలు అంశాలను ప్రస్తావించాడు. ఈ సెల్పీ వీడియోను సురేష్ కుటుంబ సభ్యులు పోలీసులకు అందజేశారు.  అందులో సురేష్.. జ్ఞానేశ్వర్‌ అనే వ్యక్తి వేధింపుల వల్లే తాను చనిపోతున్నానని పేర్కొన్నాడు. జ్ఞానేశ్వర్‌కు వడ్డీ రూపంలో రూ. 40 లక్షలు చెల్లించానని తెలిపాడు. వడ్డీ వ్యాపారి గణేష్‌కు రూ. 80 లక్షలు చెల్లించానని చెప్పాడు. ప్రామిసరీ నోట్లు, ఖాళీ పేపర్లపై తన భార్య, పిల్లల సంతకాలు చేయించుకన్నారని సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వాటితో తన భార్య, పిల్లలను వేధించారని వాపోయాడు. వడ్డీ చెల్లించినప్పటికీ తన ఇంటిని జప్తు చేశారని సురేష్ చెప్పాడు. వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్లే తాము చనిపోతున్నామని సెల్పీ వీడియోలో పేర్కొన్నాడు. వడ్డీ వ్యాపారుల ఆగడాలను అరికట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. 

తాజా పరిణామాల నేపథ్యంలో.. సురేష్ తన వాంగ్మూలంలో పేర్కొన్న నలుగురిని నిందితులుగా చేర్చి ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్లు మార్చారు. నమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాలను ఆదివారం విజయవాడలో సురేష్ బంధువులకు అప్పగించారు. దీంతో పోలీసులు జ్ఞానేశ్వర్‌ కోసం గాలింపు చేపడుతున్నారు.

ఇక, నిజామాబాద్‌ గంగాస్థాన్‌ ఫేజ్‌–2లో నివాసం ఉంటున్న పప్పు సురేష్, తన భార్య శ్రీలత, కొడుకులు అఖిల్, అశీష్‌లతో కలిసి ఈ నెల 6న విజయవాడకు వచ్చాడు. విజయవాడలోని కన్యకా పరమేశ్వరి సత్రంలో కొడుకు అఖిల్ పేరు మీద రూమ్ తీసుకున్నారు. మరుసటి రోజు విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అదే రోజు రాత్రి తాము చనిపోతున్నామని కుటుంబ సభ్యులు, బంధువులకు మెసేజ్‌లు చేశారు. 

దీంతో బంధువులు ఈ నెల 8వ తేదీ తెల్లవారుజాము వారు ఉంటున్న సత్రానికి బసచేసి.. తమవారిని కాపాడాలని కోరారు. దీంతో వెంటనే స్పందించిన సత్రం సిబ్బంది.. వారు ఉంటున్న గదిలోకి వెళ్లి చూడగా.. తల్లి శ్రీలత, కొడుకు అశీష్‌లు విగతజీవులుగా పడి ఉన్నారు. మరోవైపు సురేష్, అఖిల్‌లు ప్రకాశం బ్యారేజ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios