హైదరాబాద్ మణికొండలో తల్లీకూతుళ్ల ఆత్మహత్య చోటుచేసుకున్న ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్ మణికొండలో తల్లీకూతుళ్ల ఆత్మహత్య చోటుచేసుకున్న ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత కొంతకాలంగా తల్లీకూతుళ్లు ఇద్దరు మానసిక సమస్యతో బాధపడుతున్నారని.. వారు కరోనా సమయం ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటున్నారని ప్రాథమిక నిర్దారణ అయింది. ఈ క్రమంలోనే తల్లి తొలుత కూతురును చంపి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా తేలింది. వివరాలు.. సదానందం, అలివేలు దంపతులు మణికొండలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు లాస్య(14)ఉన్నారు.
అలివేలు, లాస్య ఇద్దరు గత రెండేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారని పోలీసులు చెబుతున్నారు. మానసిక వేదనలో ఉన్నారని.. ఈ క్రమంలోనే కుటుంబంలో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే భర్తను యాదాద్రికి వెళ్లమని చెప్పిన అలివేలు.. తొలుత కూతురును హత్య చేసింది. ఆ తర్వాత కొడుకును కూడా చంపుదామని భావించినప్పటికీ.. ఆ ప్రయత్నం విరమించుకున్నట్టుగా తెలుస్తోంది. కూతురిని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు ముందు తల్లీకూతుళ్లు ఇంట్లో పాతబట్టలు తగలబెట్టారని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. వారిద్దరు రెండేళ్లుగా ఇంటి నుంచి బయటకు రావడం లేదని.. కనీసం పక్కింటి వాళ్లతో కూడా మాట్లాడటం లేదని ప్రాథమికంగా గుర్తించినట్టుగా చెప్పారు. ఈ ఘటపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్టుగా తెలిపారు.
