బ్యూటీషియన్ శిరీష కేసు మరో మలుపు తిరిగింది. ఆమె మరణంపై ఇంకా అనుమానాలు కొనసాగుతున్నాయి. అయితే ఆమె మరణం తర్వాత కొద్దిసేపటికే కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యపై రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మకు ఎడిజి గోపీకృష్ణ నేతృత్వంలోని విచారణ కమిటీ ఒక నివేదిక అందించింది. ఈ సందర్భంగా 27 మందిని విచారించిన ఆ కమిటీ తుది నివేదికను నిన్న డిజిపికి అందజేసినట్లు తెలిసింది. అందులో కీలకమైన విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది.

శిరీష మరణం తర్వాత ఈ కేసు తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతోనే ఎస్సై ప్రభాకర్ రెడ్డి తన రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయినట్లు నివేదికలో పొందుపరిచారు. దీంతోపాటు అతి ముఖ్యమైన విషయమేమంటే ఎసిపి గిరిధర్ వేధింపులు కూడా నిజమేనని నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. ఎసిపి గిరిధర్ ఎస్సైని వేధిస్తున్నట్లు ఆయన కుటుంబసభ్యులు ఆరోపించిన విషయం తెలిసిందే. విచారణ కమిటీ కూడా తన నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. అయితే మామూళ్ల కోసం కాకుండా కేవలం డ్యూటీ విషయంలోనే గిరిధర్ వేధించారని నివేదికలో పొందుపరచినట్లుగా తెలుస్తోంది.

పోలీసు పెద్దలు ఎస్సై ప్రభాకర్ రెడ్డి విషయంలో పొంతనలేని ప్రకటనలు చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. ముందుగా శిరీషను ఎస్సై అత్యాచారం చేశాడని, అందుకే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఒక కథనం ప్రచారం చేశారు. తర్వాత అత్యాచారం కాదు, అత్యాచార యత్నం మాత్రమేనని మరో కథ చెప్పుకొచ్చారు. తర్వాత అదేమీ కాదు ఇప్పుడు మాత్రం నివేదికలో ఎసిపి గిరిధర్ వేధింపులు నిజమే అని ఒప్పుకున్నారు. ఇప్పుడు కూడా గిరిధర్ వేధింపులు కేవలం డ్యూటీ విషయంలో మాత్రమే అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అతి కొద్దిరోజుల్లోనే ఎసిపి గిరిధర్ డ్యూటీతోపాటు మామూళ్ల కోసం కూడా వేధించారని చెబుతారేమో చూడాలి.

మొత్తానికి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో ఒకింత క్లారిటీ వస్తున్నది. మరి శిరీష కేసులో మాత్రం ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉన్నది.