తొలిసారి కీలక పరీక్ష ఎదుర్కొంటున్న ఎంపి కవిత తాడో పేడో తేల్చుకునే సమయం

సిఎం కేసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవితకు తొలిసారి పెద్ద సవాల్ ఎదురైంది. ఈ సవాల్ ను ఎలా గట్టెక్కాలన్నదానిపై కవిత తీవ్రమైన కసరత్తే చేస్తున్నారు. ఎంపిగా ఉన్న ఆమె రాజకీయ భవిష్యత్తుపైన కూడా ప్రభావం చూపనున్న వాతావరణం ఉంది. ఇంతకూ కవిత ఎదుర్కొంటున్న సవాల్ ఏంటి? ఆమెకు కొత్తగా ఎదరైన టెన్షన్ ఏమిటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

తెలంగాణ రాజకీయాల్లో ఎంపి కవిత తనదైన ముద్ర వేస్తున్నారు. సిఎం కూతురుగానే కాకుండా ఆమె తెలంగాణ జాగృతి అనే ఉద్యమ సంస్థను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తూ కీర్తి ప్రతిష్టలు మూటగట్టుకుంటున్నారు. తండ్రి చాటు బిడ్డ అన్న ముద్రను తొలగించుకునేందుకు ఆమె అహోరాత్రులూ పనిచేస్తున్నారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, అంతెందుకు ప్రతి గ్రామంలో కేడర్ ను కలిగి ఉన్న అతి కొద్ది మంది నేతల్లో కవిత కూడా ఒకరు. అలాంటి కవిత తొలిసారి పెద్ద పరీక్షను ఎదుర్కోబోతున్నారు. ఈ పరీక్ష ఆమె రాజకీయ భవిష్యత్తు పైనా తీవ్రమైన ప్రభావం చూపే పరిస్థితి ఉంది.

ఎవరు అవునన్నా... ఎవరు కాదన్నా తెలంగాణ పాలకవర్గంలో ఆ నలుగురి ప్రభావమే ఎక్కువ. సిఎం కేసిఆర్ తర్వాత కేటిఆర్, కవిత, హరీష్ వీరే అధికార పార్టీలో ప్రభావవంతులుగా ఉన్నారు. కేసిఆర్ తర్వాత మిగిలిన ముగ్గురిలో కవిత స్టైల్ డిఫరెంట్. ఆమె ఎంపిగానే కాకుండా జాగృతి అనే ఉద్యమ సంస్థను నడుపుతూ క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రజా సమస్యలపై పనిచేస్తున్నారు. దీంతో ఆమెకు కొత్త కొత్త సెక్టార్లలో, కొత్త కొత్త వర్గాల్లో ఫాలోయింగ్ ఏర్పడుతోంది. కేడర్ బలం రోజురోజుకూ పెరుగుతోంది.

ఇక అసలు విషయానికి వస్తే సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని గెలిపించే బాధ్యతలు కవిత భుజానికెత్తుకున్నారు. ఆమె ప్రతి గని వద్ద ప్రచారం చేస్తూ కేడర్ లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రచారంలో పాల్గొనడంతోపాటు మిగతా కార్మిక సంఘాల నేతలను, కార్మికులను తమ సంఘంలో చేర్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మొత్తానికి ప్రచారంలో తనదైన ముద్ర వేశారు. కానీ ప్రచార పర్వం ముగిసిన నేపథ్యంలో ఎన్నికల వేళ ఫలితాలు ఎలా వస్తాయా అన్న కొత్త టెన్షన్ పట్టుకుంది కవితకు.

టిఆర్ఎస్ ఏర్పాటైన నాటి నుంచి ఏ ఎన్నికలు వచ్చినా... పార్టీకి ఇతరత్రా విషయాలను డీల్ చేయాలన్న ట్రబుల్ షూటర్ గా మంత్రి హరీష్ రావుకు మంచి పేరుంది. నాటినుంచి నేటి వరకు అనేక ఎన్నికలు ముఖ్యంగా ఉప ఎన్నికల్లో హరీష్ రావే ముందుండి వ్యవహారాలు నడిపి పార్టీని గెలపు బాటలో నడిపించారు. ఏ ఉప ఎన్నిక వచ్చినా హరీష్ రావు అక్కడ వాలిపోయేవారు. ఇక తెలంగాణ రాకముందు టిఆర్ఎస్ ను బలోపేతం చేసే బాధ్యతలను కూడా హరీష్ సమర్థవంతంగా మోశారు. మిగతా పార్టీల నుంచి బలమైన నాయకులను టిఆర్ఎస్ లోకి రప్పించడంలో కీలక పాత్ర హరీష్ రావుదే. హరీష్ దే అనే కంటే కేసిఆర్ ఆయన మీదే భారం మోపారని చెప్పవచ్చు.

అయితే కాలం మారుతున్న కొద్దీ పార్టీలో బరువు బాధ్యతలు కూడా మారుతూ వచ్చాయి. మొన్నటికి మొన్న ఏడాది క్రితం జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపు బాధ్యతను హరీష్ కు కాకుండా కేటిఆర్ భుజానికెత్తారు సిఎం. దీంతో కేటిఆర్ ప్రతి వార్డులో కలియతిరిగి పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపించారు. ప్రతిపక్ష కాంగ్రెస్, టిడిపిని చిత్తు చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితంగా టిఆర్ఎస్ లో కేటిఆర్ ప్రతిష్ట అమాంతంగా పెరిగిపోయింది.

ఇక తాజాగా ఎంపి కవిత వంతు వచ్చింది. సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలిగా నియమితులైన ఆమె బొగ్గు గని ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత తనపై ఉంది. ఒకవేళ ఫలితాలు ఏమైనా తారుమారైతే మాత్రం కవిత డీల్ చేసిన తొలి కేస్ లో ఆమెకు మైనస్ మార్కులు వచ్చే అవకాశాలున్నాయి. అందుకే కాళ్లకు చక్రాలు కట్టుకుని సింగరేణిలో ప్రచారం చేశారు. మిగతా సంఘాల వారిని మచ్చిక చేసుకుని తమ సంఘంలో చేర్పించుకోవడంతోపాటు లోపాయికారీ మద్దతును సంపాదించుకున్నారు.

కానీ గతంలో హరీష్ రావు హయాంలో అయినా, కేటిఆర్ హయాంలో అయినా గెలుపు అనేది టిఆర్ఎస్ పార్టీకి నల్లేరు మీద నడక లాంటిదే. ఎందుకంటే సెంటిమెంట్ బలం టిఆర్ఎస్ కు పుష్కలంగా ఉన్న రోజులవి. కానీ నేడు సెంటిమెంట్ బలం ఏమాత్రం లేని పరిస్థితి. దీనికితోడు సింగరేణిలో అన్ని సంఘాలు ఏకమై అధికార టిఆర్ఎస్ సంఘం మీద కత్తులు నూరుతున్న వాతావరణం ఉంది. పైగా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల విషయంలో టిఆర్ఎస్ నాన్చివేత వైఖరి కారణంగా అనేక మంది కార్మిక కుటుంబాలు అవస్థలపాలయ్యారు. అందుకే కాక మీద ఉన్నారు కార్మికులు. ఈ పరిణామాల మధ్య సింగరేణి బాధ్యతలు మోసిన కవితకు సహజంగానే పలితాల టెన్షన్ ఉండక తప్పదని చెబుతున్నారు.

మరి సింగరేణి ఫలితాలు ఎలా ఉంటాయి? టిఆర్ఎస్ లో అన్న కేటిఆర్, బావ హరీష్ లాగే తాను కూడా ఏమాత్రం తీసిపోని ఛాంపియన్ అనిపించుకుంటారా లేదా అన్నది మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది.