హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో  రెండు కరోనా కొత్త రకం వైరస్ కేసులు నమోదైనట్టుగా కేంద్రం చెబుతుంది. యూకే నుండి వచ్చిన వారిలోనే ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు.

నవంబర్ 25 నుండి ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని సీసీఎంబీ ప్రకటించింది.  ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో ఈ రకం వైరస్ ను యూకేలో తొలిసారిగా గుర్తించారు. యూకేలోని కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్లలో 60 శాతం వరకు దీని ప్రభావం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వైరల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రయత్నాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో కొత్త వేరియంట్ ఉనికిని తనిఖీ చేయాలని నిపుణులు చెప్పారు. కొత్త రకం వైరస్  కి సీసీఎంబీ శాస్త్రవేత్తలు బీ .1.1.7 గా నామకరణం చేశారు. 

కొత్త రకం వైరస్  ఎక్కువగా వ్యాప్తి చెందకుండా అడ్డుకొనేందుకు గాను మాస్క్ లు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు.

ఈ వైరస్ లో మొత్తం 17 జన్యుమార్పులున్నట్టుగా గుర్తించారు. ఎనిమిదింటి ప్రభావం దాని కొమ్ముపై ఉన్నాయని నిపుణులు చెప్పారు.వైరస్ జన్యుక్రమంపై విస్తృతస్థాయిలో నిఘా పెట్టాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిందని సీసీఎంబీ నిపుణులు చెబుతున్నారు. 

గత మూడు రోజులుగా తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. కొత్త కరోనా వైరస్ కారణంగా కేసులు పెరుగుతున్నాయా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.