గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఘనవిజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు కేసీఆర్. కాగా.. సీఎం కేసీఆర్ కాన్వాయి కోసం కొత్త కార్లను కొనాలని పోలీసులు భావిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక 2014లో కేసీఆర్ కాన్వాయ్‌లో టయోటా ల్యాండ్ క్రూజర్, ప్రడోస్, టయోటా ఫార్చునర్స్ కార్లను కొనుగోలు చేశారు. కాగా.. ప్రస్తుతం కొత్త కార్లను కొనాలని భావిస్తున్నారు. సీఎం భద్రత దృష్ట్యా హైఎండ్ కార్లను కొనాలని అధికారులు నిర్ణయించారు. మెర్సిడెస్ బెంజ్ తోపాటు వివిధ కార్లను పరిశీలించిన అధికారులు చివరకు టయోటా వాహనాలను సీఎం కాన్వాయ్ కోసం కొనాలని నిర్ణయించారు.

 సీఎం కోసం ప్రడోస్ కారును ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరంతోపాటటు గజ్వేల్ లోని తన వ్యవసాయ క్షేత్రానికి తరచూ రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో సీఎం కాన్వాయ్ లో ఏడు నుంచి పది కొత్త కార్లను కొనాలని నిర్ణయించారు. ప్రడో కారు ధర రూ.93 లక్షలు, ఫార్చునర్ కారు రూ.33 లక్షలుంది. కొత్త కార్లను కొన్నాక వాటిని మైన్ ప్రూఫింగ్ చేయించనున్నారు. సీఎం కోసం కొత్తగా మెర్సిడెస్ కారును కొనాలని తెలంగాణ పోలీసు అధికారులు భావించినా కేసీఆర్ దానిపై ఆసక్తి చూపించలేదని సమాచారం.