ఉస్మానియా ఆసుపత్రిలో చిన్నారి సుమేధ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు. రేపు సుమేధ అంత్యక్రియలు చేస్తామని కుటుంబసభ్యులు వెల్లడించారు. అధికారులు సత్వరమే స్పందించిన వుంటే సుమేధ బతికి వుండేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉదయం స్పందించినట్లుగానే నిన్న రాత్రి స్పందించివుంటే తమ బిడ్డ  ప్రాణాలతో మిగిలి వుండేదని వాపోయారు. నాలాల మీద కనీసం జాలీలైనా ఏర్పాటు చేసి వుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

14 ఏళ్లుగా ఇక్కడే నివాసం వుంటున్నామని.. అప్పుడెలా వుందో, ఇప్పుడు అదే పరిస్ధితని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల్లో మార్పు రావాల్సిన అవసరం వుందని వారు చెప్పారు. తమ కుటుంబంలో జరిగిన విషాదం మరో కుటుంబంలో జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Also Read:నేరేడ్‌మెట్టులో అదృశ్యమైన బాలిక మృతి: బండచెరువు వద్ద సుమేధ మృతదేహం లభ్యం

హైదరాబాద్ నేరెడ్‌మెట్‌లో నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన బాలిక సుమేధ బండ చెరువులో శవమై తేలింది. గురువారం సాయంత్రం ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నానని నాన్నమ్మకు చెప్పిన సుమేధ ఇంటికి తిరిగిరాలేదు.

తల్లీ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే సరికి సుమేధ కనిపించలేదు. స్థానికులను ఆరా తీసినప్పటికీ చిన్నారి ఆచూకీ తెలియలేదు. అయితే నాలా దగ్గర సుమేధ సైకిల్ కనిపించడంతో నాలాలో పడిపోయి వుంటుందని అనుమానించారు.

ఆ దిశగా సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో బండ చెరువులో బాలిక మృతదేహాం లభ్యం కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాలిక మరణవార్తతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.