అక్రమకట్టడాల కూల్చివేతను అడ్డుకున్న కార్పొరేటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లోని యాప్రాల్ లో చోటుచేసుకుంది. నగరంలోని యాప్రాల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. 

విషయం తెలిసిన వెంటనే నేరేడ్‌మెట్‌ కార్పొరేటర్ శ్రీదేవి ఘటనా స్థలికి చేరుకున్నారు. ఉద్రిక్తతలను ఆపే క్రమంలో కూల్చివేతలు నిలిపివేయాలంటూ ఆమె అధికారులను, పోలీసులను డిమాండ్ చేశారు. 

వెంటనే కార్పొరేటర్ శ్రీదేవిని అడ్డుకున్న జవహర్‌నగర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈరోజు ఉదయం 6 గంటల నుండి అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. 

భారీ పోలీసు భద్రతల మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. కావాలనే తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని కాలనీవాసులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నాయి.