Asianet News TeluguAsianet News Telugu

షీ టీమ్స్‌ పనితీరు భేష్.. గణేశ్‌ నిమజ్జనంలో 240 మంది ఆకతాయిల ఆట కట్!

హైదరాబాద్‌లో జ‌రిగిన వినాయక నిమజ్జనోత్సవాలలో మహిళలను, యువ‌తుల‌ను వేధింపుల‌కు గురి చేసిన‌  దాదాపు 240 మంది ఆక‌తాయిల‌ను షీ టీం పోలీసులు అరెస్టు చేశారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వ్య‌క్తుల‌ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తగిన ఆధారాలతో నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు

Nearly 240 men were arrested for harassing women during Ganesh Chaturthi in Hyderabad
Author
First Published Sep 13, 2022, 1:09 PM IST

మహిళా, చిన్నారుల‌ రక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన షీటీమ్స్ అత్యంత సమర్థవంతంగా పని చేస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, ర‌ద్దీగా ఉండే బ‌స్టాండ్లు, రైల్వే సేష్ట‌న్ల‌లోనే కాకుండా.. ఆన్‌లైన్‌లో వేధింపులకు పాల్పడుతున్న  ఆఘాతాయిల ఆటను కట్టిస్తున్నాయి. ఒక్క ఫిర్యాదు చేస్తే.. బాధితుల ప‌క్ష‌న నిల‌బ‌డి వారికి  ధైర్యాన్ని నిస్తూ..  నిందితులను ప‌ట్టుకుని  కటకటాల్లోకి వేసే వ‌ర‌కూ త‌గ్గేదేలే అంటున్నాయి.  

తాజాగా..  షీటీమ్స్ పని తీరుపై ప్ర‌శంస‌లు అందుతున్నాయి. హైద‌రాబాద్ లో వినాయక నిమజ్జనోత్సవాలలో పోకిరీ చేష్టలకు అడ్డుక‌ట్ట వేశాయి. మహిళలను, యువ‌తుల‌ను వేధింపుల‌కు గురి చేసిన‌  దాదాపు 240 మంది ఆక‌తాయిల‌ను షీ టీమ్ పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు. తగిన ఆధారాలతో నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు వారికి శిక్ష‌ను ఖ‌రారు చేసింది. ఒక్కొక్క‌రికి రూ. 250 చొప్పున జరిమానా, 2 నుంచి 10 రోజుల పాటు జైలు శిక్షలు విధిస్తూ కోర్టు  తీర్పు వెల్లడింది.

ఈ సంద‌ర్భంగా నగర అదనపు పోలీస్‌ కమిషనర్‌ ఏఆర్‌ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా షీ టీమ్స్‌ ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామ‌నీ, అన్ని గణేష్ మండపాల వద్ద హైదరాబాద్ షీ టీమ్ పోలీసులు మష్టీలో పహారాలో పెట్టామ‌ని తెలిపారు. షీ టీమ్స్‌ అదనపు డీసీపీ శిరీష రాఘవేంద్ర నేతృత్వంలోని బృందాలు.. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, ఉద్దేశపూర్వకంగా వారిని తాకడం, వేధింపులకు గురిచేయడం, అస‌భ్యక‌రంగా కామెంట్స్ చేసిన 240 మందిని రహస్యంగా ఏర్పాటు చేసిన  కెమెరాల ద్వారా గుర్తించారు.

మఫ్టీలో (సాదా దుస్తులు) ఉన్న షీ టీం సభ్యులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  తగిన ఆధారాలతో నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. ట్రయల్ కోర్టు వారికి రూ.250 జరిమానా, 2 నుండి 10 రోజుల వరకు జైలు శిక్ష విధించింది. మహిళల ఆత్మగౌరవానికి భంగం క‌లిగించే ఆకతాయిల ప‌ట్ల  కఠిన చ‌ర్య‌లు తీసుకున్న అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలోని షీ టీమ్స్‌ అదనపు డీసీపీ శిరీష, ఆమె బృందానికి సీపీ సీవీ ఆనంద్ ప్ర‌త్యేక అభినందనలు తెలిపారు.

సైబరాబాద్‌లో 11షీ టీమ్స్
  
వినాయ‌క‌ నిమజ్జనంలో భాగంగా సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో  11 షీ టీమ్స్ ను రంగంలో దించారు.167 డెకాయిట్ ఆపరేషన్లు నిర్వహించినట్లు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. పోకిరీ చేష్టాల‌కు పాల్ప‌డేవారిపై ప్ర‌త్యేక‌ నిఘా పెట్టినట్లు తెలిపారు.  ఒక్కో బృందంలో ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారని తెలిపారు. నిమజ్జనం కార్యక్రమాల్లో ఈవ్‌ టీజింగ్‌కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios