హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని అమీన్ పూర్ కాజ్ వేపై వరద నీటిలో కారుతో కొట్టుకుపోయిన ఆనంద్ కోసం నాలుగు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా అతని ఆచూకీ లభ్యం కాలేదు. ఇవాళ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది  ఆయన కోసం గాలింపు చర్యలు  చేపట్టారు.

ఈ నెల 13వ తేదీన బీహెచ్ఈఎల్ డిపో నుండి అమీన్‌పూర్ కాజ్‌వే ను దాటే సమయంలో ఆనంద్ అనే వ్యక్తి కారుతో సహా వరద నీటిలో కొట్టుకుపోయాడు. కారు వరద నీటిలో కొట్టుకుపోయే సమయంలో ఆయన తన సోదరుడికి ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్పాడు. అంతేకాదు తన లోకేషన్ ను ఆయన షేర్ చేశాడు. 

also read:హైద్రాబాద్ పాతబస్తీ అలీనగర్‌లో నాలుగు మృతదేహాలు లభ్యం: మరో నలుగురి కోసం గాలింపు

13వ తేదీ నుండి ఆనంద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఇంతవరకు ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. అమీన్‌పూర్ కాజ్ వే కు దిగువన మత్తడి ఉన్నందున  ఈ ప్రాంతంలో కారుతో పాటు ఆనంద్ ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

ఇవాళ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆనంద్ కోసం గాలింపు చేపట్టాయి. ఆనంద్ కు భార్య, ఓ కూతురు ఉంది. భార్య ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి, ఆనంద్ కూతురుది ఇవాళ పుట్టినరోజు.కాజ్ వే వద్ద ఆనంద్ ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ఉన్నారు. రెవిన్యూ తో పాటు పలు శాఖల అధికారులు కాజ్ వే వద్ద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.