హైదరాబాద్: తెలంగాణ తొలి హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డికి బుల్లెట్ వీరుడిగా పేరుంది. 1978 నుంచి చాలా కాలం ఆయున బుల్లెట్ మీదనే తిరిగేవారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా ఆయన బుల్లెట్ ను వీడలేదు. దానిపైనే తిరుగుతూ కనిపించేవారు. పంచెకట్టు, కుర్తాలు ధరించి కోర మీసాలతో ఆయన బుల్లెట్ మీద తిరుగుతుంటే అందరూ కళ్లార్పకుండా చూసేవారు. కార్యక్రమాలకు కూడా ఆయన బుల్లెట్ మీదనే హాజరయ్యేవారు. 

ఆ తర్వాత ఆయన మహేంద్ర జీప్ వాడుతూ వచ్చారు. దాంతో బుల్లెట్ వీరుడు కాస్తా జీప్ వీరుడు అయ్యారు. ఆ బుల్లెట్, జీప్ ఇప్పటికీ ఆయన వద్దనే ఉన్నాయి. వాటిని తానే స్వయంగా కడిగి షెడ్డులో పెట్టేవారు. నాయిని నర్సింహారెడ్డి  హెచ్ఎస్సీ పూర్తి చేసిన తర్వాత 1958లో డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆధ్వర్యంలో సోషలిస్టు పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. 

నాయిని తండ్రి దేవారెడ్డి కూడా సోషలిస్టు పార్టీలో చురుకైన పాత్ర పోషించేవారు. దాంతో ఆయన పోలీస్ యాక్షన్ లో కాల్చి చంపారు. ఆ సమయంలోనే ఆయన తన పెద్దనాన్న కుమారుడు రాఘవరెడ్డితో కలిసి దేవరకొండలో సోషలిస్టు పార్టని స్థాపించారు. విద్యార్థి దశలో 1957లో జరిగి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలోనూ, నాన్ ముల్కీ పోరాటంలోనూ నాయిని పాల్గొన్నా3రు. 1960లో తాళా బొడో (గోదాముల ముట్టడి) కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read: తెలంగాణ తొలి హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి కన్నుమూత

ఆ తర్వాత 1952లో హైదరాబాదుకు తన మకాం మార్చారు. హైదరాబాదు పాతబస్తీలోని శాలిబండలో గల కోవాబేలాలో నివాసం ఉండేవారు. సోషలిస్టు పార్టీ కార్యాలయ ఇంచార్జీగా బేగంబజారులోని లాల్ గీర్స్ మఠంలో ఉన్న కార్యాలయంలో పనిచేశారు. ఆ తర్వాత 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. చాలా సార్లు జైలుకు కూడా వెళ్లారు.