హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి హోమ్ మంత్రి తెరాస సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి ఇందాక కొద్దిసేపటి కింద తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. సెప్టెంబర్ 30వ తేదీన కరోనా సోకడంతో ఆయన హైద్రాబాద్ ఆపోలో ఆసుపత్రిలో చేరారు. ఇదే ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత 12.26 గంటలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 

 హైరాబాదులోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గవర్నర్ కోటాలో మండలికి ఎంపికై హోం మంత్రి పదవిని చేపట్టారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఆయన నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము గ్రామంలో  జన్మించారు. కార్మిక నేతగా ఆయనకు మంచి పేరుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో కూడా ఆయన పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పో,ించారు.

తొలిసారి ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి నాయిని 1978లో దివంగత ముఖ్యమంత్రి టి. అంజయ్యపై విజయం సాధించారు. 1985, 2004ల్లో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. 2001లో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాతర్ పషించారు.

కరోనా నుండి కోలుకొన్నప్పటికీ.... శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడుతున్న నాయిని ఆరోగ్యం మరింత విషమించడంతో మరణించినట్టుగా వైద్యులు తెలిపారు. కిడ్నీల్లో పొటాషియం స్థాయిలు పెరిగినట్లు, ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు ఇదివరకే ప్రకటించారు. 

కిడ్నీ సమస్యల నేపథ్యంలో ఆయనకు డయాలిసిస్ ట్రీట్మెంట్ ని వైద్యులు అందించారు. మంగళవారం నాడు మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి ఆయనను పరామర్శించినప్పుడు ఆయన ట్రీట్మెంట్ కి సరిగా స్పందించడంలేదని వైద్యులు మంత్రులకు వివరించారు. 

కరోనా కంటే ముందుగానే ఆయనకు గుండెకు సంబంధమైన శస్త్రచికిత్స జరిగింది. ఆ తరువాత కరోనా బారినపడడంతో .... చికిత్స కోసం ఆయన ఆసుపత్రిలో చేరారు. 
గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

సోమవారం నాడు తెలంగాణ మంత్రి కేటీఆర్ నాయినిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకొన్నారు. నాయిని కొడుకు, అల్లుడికి కూడ కరోనా బారినపడ్డ విషయం విదితమే!