హైదరాబాద్: తాను ఢిల్లీకి పోదామనుకుంటున్నా, గల్లీకి పోను అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. ఎవరైనా పైకే పోదామనుకుంటారు గానీ గల్లీకి రావాలని అనుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభ సీటు విషయంపై శుక్రవారం శాసనసభ లాబీలో మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ఆయన ఆ విధంగా అన్నారు. 

ఢిల్లీకి పోదామనుకుంటున్నారా, ఆర్టీసీ చైర్మన్ పదవి తీసుకుంటారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ఆయన స్పందించి తాను రాజ్యసభకే వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలిపారు. 

రాజ్యసభకు ఎవరెవరు పోటీ పడుతున్నారని ప్రశ్నించగా, మాజీ ఎంపీలు కవిత, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఓ ఫార్మా కంపెనీ యజమాని పేర్లు వినిపిస్తున్నాయని ఆయన సమాధానం ఇచ్చారు. 

తొలి విడత కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు నాయని నర్సింహా రెడ్డి హోం మంత్రిగా పనిచేశారు. రెండో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ సీనియర్లను పక్కన పెట్టి పలువురు జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారు. నాయని నర్సింహా రెడ్డికి ఆర్టీసి చైర్మన్ పదవి ఆఫర్ చేశారు. 

అయితే, దాన్ని తీసుకోవడానికి ఆయన సముఖంగా లేరు. ఆ విషయాన్ని నాయని నర్సింహా రెడ్డి బహిరంగంగానే చెప్పారు. ఆ సమయంలో కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు.