హైదరాబాద్: తెలుగు సినీ నటుడు నారా రోహిత్ విడుదల చేసిన ఒక్కటి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో నారా రోహిత్ చేసిన ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆయన త్వరంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పగ్గాలు చేపట్టబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. 

తమ పార్టీ అధ్యక్షుడిని మార్చాలని పలువురు తెలంగాణ నాయకులు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్. రమణ కొనసాగుతున్నారు. ఆయనను మార్చాలని పలువురు టీడీపీ నాయకులు కోరుతున్నారు. ఈ స్థితిలో నారా రోహిత్ విడుదల చేసిన వీడియో చర్చకు దారి తీసింది. 

"హాయ్... నేను మీ నారా రోహిత్. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఉదయం 11 గంటలకు తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం ఓ మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. మన తెలంగాణ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ తగిన కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ క్యాంప్ ను విజయవంతం చేయమని కోరుతున్నాను" అని నారా రోహిత్ ఆ వీడియోలో అన్నారు.

దానిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. టీటీడీపీ పగ్గాలను నారా రోహిత్ చేపట్టబోతున్నట్లు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. నారా రోహిత్ అవసరమైనప్పుడు టీడీపీ తరఫున మాట్లాడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారం చేశారు. అయితే, తాజా ప్రచారంపై నారా రోహిత్ స్పందించలేదు.