ప్రజావేదిక కూల్చివేతతో పాటు టీడీపీ నేతలపై దాడులు.. తమ కుటుంబసభ్యులకు భద్రతను కుదించడం తదితర విషయాలపై స్పందించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.

గండిపేటలోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌లో కామన్ లా అడ్మిషన్ టెస్టులో ర్యాంకులు సాధించిన విద్యార్ధులను గురువారం ఆమె అభినందించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ... జీవితంలో గెలుపోటములు సహజమని ఆమె వ్యాఖ్యానించారు.

2015లో 88 మంది బాలికలతో ఎన్టీఆర్ కాలేజీని స్థాపించామని.. ఇప్పుడు 200 మంది బాలికలు ఈ కాలేజీలో చదువుతున్నారని పేర్కొన్నారు.

సివిల్స్, న్యాయ, ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నామని.. వచ్చే ఏడాది ఎక్కువ ప్రతిభ కనబరిచిన విద్యార్ధికి గోల్డ్ మెడల్ ఇస్తామన్నాని ఆమె స్పష్టం చేశారు. ధైర్యంగా నిలబడి, పోరాడటం అలవర్చుకోవాలని.. కార్యక్షేత్రంలోకి దిగితేనే వాస్తవాలు తెలుస్తాయని భువనేశ్వరి తెలిపారు.