సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో మరింత కీలక సమాచారం అందనుంది. శిరీష ఆత్మహత్య కేసులో ఎ1 నిందితుడిగా ఉన్న శ్రావణ్, ఎ2 నిందితుడిగా ఉన్న రాజీవ్ ను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
శిరీష ఆత్మహత్య ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే రాజీవ్, శ్రావణ్ లను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరిపారు. వారి నుంచి కీలకమైన సమాచారమంతా సేకరించారు. అనంతరం వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు వారికి రిమాండ్ విధించింది.
అయినప్పటికీ మరిన్ని అంశాలపై పోలీసులు లోతైన విచారణ జరిపేందుకు నిర్ణయించిన బంజారాహిల్ పోలీసులు 5 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు
బంజారాహిల్స్ పోలీసుల పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు 5రోజుల కస్టడీకి కాకుండా 2 రోజులపాటు నిందితులిద్దరినీ పోలీసు కస్టడీకి ఇచ్చేందుకునేందుకు అనుమతించింది.
ఈనెల 26, 27 తేదీలలో శ్రావణ్, రాజీవ్ లను రెండు రోజులపాటు పోలీసులు తమ కస్టడీకి తీసుకోనున్నారు. ఈసందర్భంగా మరింత సమాచారం నిందితుల నుంచి సేకరించి కేసులో పురోగతి సాధించేందుకు ప్రయత్నించనున్నారు.
మరోవైపు కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి మరణంపైనా మరింత సమాచారం రావాల్సి ఉంది. ఎస్సై ఆత్మహత్య కేసులోనూ రాజీవ్, శ్రావణ్ ల నుంచి మరిన్ని అంశాల్లో విచారణ జరపాలని పోలీసులు భావిస్తున్నారు.
శిరీష కుటుంబసభ్యులు అనేక అంశాలను, అనుమానాలను లేవనెత్తుతున్నారు. శిరీష పోలీసు క్వార్టర్స్ లో కాకుండా ఫామ్ హౌస్ లో ఉన్నట్లు గూగుల్ టవర్ లొకేషన్ పంపిందని అంటున్నారు. దానిపైనా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులపై ఉందంటున్నారు.
రెండు రోజుల పోలీసు కస్టడీ తర్వాత మరింతగా కేసులో క్లారిటీ వచ్చే అవకాశాలున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
