ఖమ్మం మహాకూటమి అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు బరిలోకి దిగనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఎప్పుడూ ఎంపీ పదవికి పోటీ చేసే ఆయన ఈ సారి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేయనున్నట్లు తెలుస్తోంది.

నామ కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గురువారం ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య ప్రసంగిస్తూ.. ఖమ్మం ఎమ్మెల్యేగా నామా నాగేశ్వరరావు పోటీ చేయడానికి సుముఖంగానే ఉన్నారని, నామా పోటీ ఖాయమని స్పష్టం చేశారు. అయితే.. నామా మాత్రం అధికారికంగా ఎక్కడా తన అంగీకారాన్ని తెలపడంలేదు. నాయకులు, పార్టీ కేడర్‌ నుంచి మాత్రమే ప్రచారం నడుస్తోంది. 

నామా నాగేశ్వరరావు కూడా పార్లమెంటుకు పోటీ చేయాలా..? లేక అసెంబ్లీ బరిలో దిగాలా..? అన్న విషయంపై ఖమ్మం పట్టణంలోని ప్రముఖులతోపాటు, ఆయా వర్గాల నేతలతోనూ చర్చిస్తున్నట్టు తెలిసింది. పార్టీ అధ్యక్షుడు పోటీ చేయమని ఆదేశిస్తే తప్పనిసరిగా పోటీ చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని మాత్రం నామా చెబుతూ వస్తున్నారు. 

టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంటరీ పార్టీ నేతగా జాతీయ రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న నామా.. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిచెందారు. ఆ తర్వాత పార్టీ ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతూ వస్తున్నారు. అయితే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి వస్తే ఖమ్మం లోక్‌సభకే పోటీ చేయాలనే ఆలోచనలో ఉండగా.. టీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. దీంతో అసెంబ్లీకి పోటీ చేయాలా? లేక పార్లమెంటుకు పోటీచేయాలా? అన్న సందిగ్ధంలో ఉన్నారు. 

కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ కూటమిగా ఏర్పడడంతో జిల్లాలో ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట సీట్లలో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం అసెంబ్లీ సీటుకు నామా నాగేశ్వరరావే సరైన అభ్యర్థి అని, ఆయనే పోటీ చేయాలని పార్టీ కేడర్‌ మొదటి నుంచి ఒత్తిడి తెస్తోంది. ఈ విషయమై త్వరలో నామ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.