ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నల్లాల ఓదెలు అనుచరుడు గట్టయ్య మరణించడంతో ఆయన స్వగ్రామం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నేతల టికెట్ పోరులో గట్టయ్య సమిధయ్యాడని పలువురు ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తూ.. ఆందోళనకు దిగారు.

దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు. టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో మంచిర్యాల జిల్లా చెన్నూరు టికెట్‌ను నల్లాల ఓదెలుకు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఓదెలు అనుచరుడు రేగుంట గట్టయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలో ఈ నెల 12న బాల్కసుమన్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ఇందారం వచ్చారు.. ఈ సమయంలో గట్టయ్య పెట్రోలు పోసుకుని  ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోల్ పోసుకున్న గట్టయ్యకు మహిళల మంగళహారుతుల నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి.

60 శాతానికి పైగా కాలిన గట్టయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం గట్టయ్య మరణించాడు. ఇవాళ ఇందారంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.