నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ... ఎవరికెన్ని ఓట్లు వచ్చాయంటే...
తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో ఇప్పటివరకు ఏ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
ఇటీవల నల్గొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఉప ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. మూడు జిల్లాల్లో మొత్తం 3 లక్షల 36 వేలమంది గ్రాడ్యుయేట్స్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అయితే బ్యాలట్లలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం త్వరలోనే తేలనుంది. నిన్న(బుధవారం) ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలయిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు అధికారులు. ప్రస్తుతం మూడు రౌండ్ల కౌంటింగ్ ముగియగా కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రెండు రౌండ్ల కౌంటింగ్ ముగియగా అందులోనూ మల్లన్న ఆధిక్యం సాధించారు. ఇలా మూడు రౌండ్లలో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం 17 వేలకు చేరుకుంది. ఈ లెక్కన చూస్తుంటే మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలేలా కనిపించడంలేదు... కాబట్టి రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం కానున్నాయి. మరో రౌండ్ తో అంటే నాలుగో రౌండ్ తో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తికానుంది.
బుధవారమే నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంకాగా అర్థరాత్రి తొలి రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 36,210 ఓట్లు వచ్చాయి. ఇక బిఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 28,540, బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 11,395 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ లో మల్లన్నకు వచ్చిన ఆధిక్యం 7,670 ఓట్లు.
ఇక రెండు రౌండ్ ఫలితాలు ఇవాళ(గురువారం) ప్రకటించారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థికి 34,575, బిఆర్ఎస్ అభ్యర్థికి 27,573, బిజెపి అభ్యర్థికి 12,841 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ లో మల్లన్నకు వచ్చిన ఆధిక్యం 7,002 ఓట్లు. మొదటి రౌండ్ ఆధిక్యాన్ని కలుపుకుంటే కాంగ్రెస్ కు 14,672 ఓట్ల ఆధిక్యం లభించింది.
అయితే రౌండ్ రౌండ్ కు కాంగ్రెస్ ఆధిక్యం తగ్గుకుంటూ వస్తోంది. మూడో రౌండ్ లో మల్లన్నకు కేవలం 3వేల పైచిలుకు ఆధిక్యం మాత్రమే వచ్చిందట. దీంతో అతడి మొత్తం ఆధిక్యం 17వేలకు చేరుకుంది. బిఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి నుండి మల్లన్న గట్టిపోటీ ఎదుర్కొంటున్నాడు.
నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీగా కొనసాగుతుండగానే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసారు. ఇలా ఆయన జనగామ నుండి పోటీచేసి గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసారు. దీంతో ఉప్పఎన్నిక వచ్చింది. మే 27న పోలింగ్ జరగ్గా తాజాగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.