Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ సర్కారుకు కొత్త టెన్షన్.. కోమటిరెడ్డి, సంపత్ కేసు

అసెంబ్లీలో ఇద్దరు శాసనసభ్యుల సస్పెన్షన్ పై సర్వత్రా విమర్శలు గుప్పుమంటున్నవేళ తాజాగా తెలంగాణ సర్కారుకు మరో టెన్సన్ మొదలైంది. నిన్న అడ్వొకెట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి రాజీనామా చేయడం ప్రభుత్వానికి గొంతులో వెలక్కాయ పడ్డట్లు అయింది.
Nalgonda police face ire of local  women folk

తెలంగాణ సర్కారు కొత్త ఇరకాటంలో పడింది. ఒకవైపు అసెంబ్లీలో ఇద్దరు శాసనసభ్యుల సస్పెన్షన్ పై సర్వత్రా విమర్శలు గుప్పుమంటున్నవేళ తాజాగా తెలంగాణ సర్కారుకు మరో టెన్సన్ మొదలైంది. నిన్న అడ్వొకెట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి రాజీనామా చేయడం ప్రభుత్వానికి గొంతులో వెలక్కాయ పడ్డట్లు అయింది. అడ్వొకెట్ జనరల్ ఎందుకు రాజీనామా చేశారన్నదానిపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ పరిస్థితుల్లో ఇవాళ హైకోర్టులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వ రద్దు అంశంపై విచారణ జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వం తరుపున న్యాయవాదులెవరూ ఈ కేసులో విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ కేసును మధ్యాహ్నం రెండున్నరకు న్యాయమూర్తి వాయిదా వేశారు.

ఒకవైపు మనస్థాపంతో అడ్వొకెట్ జనరల్ తన పదవికి రాజీనామా చేసినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఆయన రాజీనామాపై ఇంకా ముఖ్యమంత్రి కేసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఆయన రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరే చాన్స్ ఉందా? లేదంటే రాజీనామాను ఆమోదిస్తారా అన్నది అతికొద్దిసేపట్లో తేలే అవకాశం ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ సభ్యత్వ రద్దు కేసులో వీడియో పుటేజీ ఇచ్చేందుకు అడ్వొకెట్ జనరల్ హైకోర్టులో అంగీకరించడం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసిన వీడియో పుటేజీలో కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్ ఫోన్ విసిరిన వీడియో మాత్రమే విడుదల చేశారు. కానీ.. స్వామి గౌడ్ కంటికి గాయమైనట్లు చూపే వీడియోలు విడుదల చేయలేదు. దీంతో ఎజి హామీ వల్ల అన్ని వీడియోలు కోర్టుకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని సర్కారు టెన్షన్ తో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక ఈ కేసులో వాదించేందుకు ఢిల్లీ నుంచి సీనియర్ అడ్వొకెట్ హరీష్ సాల్వేను ప్రభుత్వం తీసుకొస్తుందన్న ప్రచారం జరిగింది. ఈ విషయంలో ఎజి ప్రకాష్ రెడ్డికి ఏమాత్రం సమాచారం లేకుండానే ఆయనతో చర్చలు జరిపినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ప్రకాష్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అందుకే ఆయన తన పదవికి రాజీనామా చేశారని చెబుతున్నారు.

కానీ మంగళవారం ఉదయం ప్రభుత్వం తరుపున అడ్వొకెట్ లు ఎవరూ కోమటిరెడ్డి, సంపత్ కేసులో విచారణకు హాజరు కాలేదు. దీంతో కేసు వాయిదా పడింది. మరి మధ్యాహ్నం రెండున్నర లోగా ప్రకాష్ రెడ్డి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారా అన్నది తేలాలి. ఒకవేళ ఆయన రాజీనామా ఆమోదిస్తే మరో కొత్త ఎజి ని ప్రభుత్వం నియమించుకోవాలి. ఇంకోవైపు హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తారా? లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది. ప్రభుత్వం బుజ్జగించినా.. ప్రకాష్ రెడ్డి వెనక్కు తగ్గుతారా అన్నది అనుమానమే అని న్యాయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios