ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగానే వున్నామని.. శాసనసభను తక్షణం రద్దు చేయాలని మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. శ్రీలంకలో రాజపక్సే కుటుంబానికి పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని ఆయన జోస్యం చెప్పారు.

టీఆర్ఎస్ (trs) వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్‌కు (ktr) కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam kumar reddy) సవాల్ విసిరారు. శాసనసభ ఇప్పుడే రద్దు చేయాలని.. తాము ఎన్నికలకు సిద్ధంగానే వున్నామని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే విజయమని ఉత్తమ్ జోస్యం చెప్పారు. కేటీఆర్... నువ్వెంత నీ స్థాయి ఎంత అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌పై మాట్లాడే స్థాయి నీదా అంటూ కేటీఆర్‌పై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ పై కేటీఆర్ చేసినవి అహంకారపూరిత వ్యాఖ్యలేనని ఆయన అన్నారు. శ్రీలంకలో రాజపక్సే కుటుంబానికి పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. 

అంతకుముందు .. శుక్రవారం ఉదయం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 90 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. మొన్న విడుదల చేసిన సర్వే బీజేపీ, నిన్న విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీలకు చెందిందన్నారు.కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ సాధిస్తారు. దక్షిణాదిలో వరుసగా ఎవరూ సీఎంగా బాధ్యతలు చేపట్టలేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ సర్వేలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. కేసీఆర్ దొర అయితే ఎంతమందిని జైల్లో వేశారని ఆయన ప్రశ్నించారు. మంచి పనులతో ప్రజల మనసులు గెలవడం బీజేపీ చేతకాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఎవరికీ లొంగరు, బెదరని కేటీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణపై కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తుందన్నారు. 

Also REad:ముందస్తు లేదు, నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు: తేల్చేసిన కేటీఆర్

ఈ రెండు సర్వేలు కూడా తెలంగాణలో టీఆర్ఎస్ విజయం సాధిస్తాయని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో బలాలు, బలహనీతల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక చేస్తామన్నారు కేటీఆర్. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ లో చేరాలని తాము ఎవరిని బలవంతం చేయడం లేదన్నారు. పార్టీ నేతల మధ్య గొడవల విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా తమ పార్టీ బలాన్ని సూచిస్తుందని కేటీఆర్ చెప్పారు. సిరిసిల్లకు రాహుల్ గాంధీ వస్తే స్వాగతిస్తామన్నారు.సిరిసిల్లకు వచ్చి రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలను కోరుతామన్నారు. తెలంగాణ గవర్నర్ తో తమకు ఎలాంటి పంచాయితీ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.